Begin typing your search above and press return to search.

టైం లేదు.. స‌ర్వ‌ర్ డౌన్.. ఓట‌రుకు కొత్త టెన్ష‌న్!

By:  Tupaki Desk   |   14 March 2019 4:15 AM GMT
టైం లేదు.. స‌ర్వ‌ర్ డౌన్..  ఓట‌రుకు కొత్త టెన్ష‌న్!
X
ఏపీ ఓట‌ర్ల‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కార‌ణం ఏదైనా కానీ.. ఓట‌రు జాబితాలో పేరు లేనోళ్లు.. ఆల‌స్యంగా క‌ళ్లు తెరిచి.. హ‌డావుడిగా ఓట‌ర్ల జాబితాలో పేర్లు న‌మోదు చేయించుకోవాల‌ని త‌పిస్తున్న వారికి ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి షాకిస్తోంది. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కును వినియోగించుకోవ‌టానికి వీలుగా.. ఓట‌ర్ల జాబితాలో పేరు లేని వారికి ఐదు రోజుల పాటు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకునే అవ‌కాశాన్ని ఈసీ క‌ల్పించింది.

ఇటీవ‌ల కాలంలో ఓట్ల‌ను భారీగా తొల‌గించార‌న్న ప్ర‌చారంతో పాటు.. ఎప్ప‌టి మాదిరే ఓటర్ల జాబితాలో పేరు మిస్ అయినోళ్లు.. ఓట్ల‌ను న‌మోదు చేయించుకోనివారంతా ఇప్ప‌టికిప్పుడు నిద్ర లేచి.. త‌మ పేర్ల‌ను జాబితాలో న‌మోదు చేయించుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న వారికి.. సాంకేతిక స‌మ‌స్యలు చుక్క‌లు చూపిస్తున్నాయి.

ఆ మ‌ధ్య వ‌ర‌కూ జాబితాలో పేర్లు ఉన్న వారు.. తాజాగా లేక‌పోవ‌టాన్ని చూసి ల‌బోదిబో అంటున్నారు. ఇప్ప‌టికైనా మించిపోయింది లేద‌నుకొని ఆన్ లైన్లో ఓట్ల‌ను న‌మోదు చేసుకోవాల‌నుకున్న వారికి స‌ర్వ‌ర్ డౌన్ షాకింగ్ గా మారింది. ఈసీ ఇచ్చిన ఐదు రోజుల గ‌డువులో మూడు రోజులు అయిపోయి.. మ‌రో 48 గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉండటం.. ఆన్ లైన్ ద్వారా ఓట్ల‌ను న‌మోదు చేసుకోవ‌టానికి స‌ర్వ‌ర్లు మొరాయించ‌టంతో ఓట‌ర్ల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.

ఓట‌ర్ల జాబితాలో త‌మ పేర్ల‌ను చూసుకుంటున్న ఏపీ ప్ర‌జ‌లు.. జాబితాలో పేర్లు లేని వారు ఆందోళ‌న చెందుతున్నారు. వెంట‌నే త‌మ పేరును న‌మోదు చేసుకోవ‌టానికి కంప్యూట‌ర్లు.. మొబైల్ ఫోన్లు.. ఈ సేవా సెంట‌ర్లు ఇలా ఏ అవ‌కాశం అందుబాటులో ఉంటే దాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. అయితే.. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా వారు త‌మ ఆప్లికేష‌న్ల‌ను ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోతున్నారు.

తెల్లారింది మొద‌లు.. రాత్రి పొద్దుపోయే వ‌ర‌కూ ప్ర‌య‌త్నిస్తున్నా.. ఉప‌యోగం ఉండ‌టం లేదు. స‌ర్వ‌ర్ డౌన్ అయిపోవ‌టంతో ఆన్ లైన్లో ద‌ర‌ఖాస్తు ముందుకు వెళ్ల‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవ‌టానికి వీలు లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉంటే.. ఆన్ లైన్లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటే.. ఆఫ్ లైన్లో అధికారుల‌కు ద‌ర‌ఖాస్తులు అంద‌జేయాల‌ని కోరుతున్నారు.

అయితే.. ఇలా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్ని అధికారులు ఎంత‌మేర ప్రాసెస్ చేస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఈసీకి చెందిన స‌ర్వ‌ర్లు డౌన్ కావ‌టం ఏమిట‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది. దీనిపై ఎన్నిక‌ల సంఘం వెంట‌నే స్పందించాల‌ని ఏపీ ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఒక‌వేళ సాంకేతిక స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌లేని ప‌రిస్థితే ఉంటే.. ఓట‌రు న‌మోదు కార్య‌క్రమ గ‌డువును పెంచాల‌ని ప‌లువురు కోరుకుంటున్నారు.