Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'బీఆర్ఎస్'కు పోటీగా మూడు పార్టీలు.. షాకిచ్చిన ఈసీ?

By:  Tupaki Desk   |   6 Oct 2022 10:34 AM GMT
కేసీఆర్ బీఆర్ఎస్కు పోటీగా మూడు పార్టీలు.. షాకిచ్చిన ఈసీ?
X
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి దేశాన్ని ఏలేద్దామనుకున్న కేసీఆర్ కు అంత ఈజీ కాదని తొలి దశలోనే అర్థమవుతోంది. బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ కు షాకిచ్చినట్టు సమాచారం. కేసీఆర్ తన పార్టీని 'బీఆర్ఎస్' గా మార్చుతూ నిన్న తీర్మానించి పంపించిన కాపీని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ సహా టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు కలిసి ఈసీకి ఈరోజు సమర్పించారు. తమ పార్టీ పేరును 'బీఆర్ఎస్'గా మార్చాలని కోరారు.

అయితే ఈసీ మాత్రం తాజాగా షాకిచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే 'బీఆర్ఎస్' పేరు మీద దేశవ్యాప్తంగా మూడు పార్టీలు రిజిస్ట్రర్ అయ్యాయని.. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెప్పినట్టు సమాచారం.

ఈనెల 14లోపు బీఆర్ఎస్ గా మార్చితే ఆ గుర్తుపైనే పోటీచేస్తామని.. లేదంటే టీఆర్ఎస్ గుర్తుపైనే చేస్తామని ఈసీని కలిసిన తర్వాత టీఆర్ఎస్ సీనియర్ నేత బి.వినోద్ మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ పేరు మీద మూడు పార్టీలు ఉన్నాయని.. ఈసీ నిర్ణయం వెలువడ్ద తర్వాత దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామని వినోద్ తెలిపారు.

జైపూర్ నుంచి భారత్ రాష్ట్ర సమానతవాద పార్టీ, , ముంబై నుంచి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, సికింద్రాబాద్ నుంచి 'బహుజన్ రాష్ట్ర సమితి'లు ఈసీ వద్ద రిజిస్ట్రర్ అయ్యి ఉన్నాయని.. గుర్తింపు పొందలేదని.. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు ఈసీ వర్గాలు వెంటనే ఒప్పుకోలేదని సమాచారం.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పార్టీ పేరు మార్పుకు ఆదిలోనే షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మూడు పార్టీల అభ్యంతరాలతో ఈసీ పేరు మారుస్తుందా? మార్చినా గుర్తును 'కారు'నే బీఆర్ఎస్ కు ఇస్తుందా? అన్నది సందేహమే. టీఆర్ఎస్ 'కారు' గుర్తు పోతే తెలంగాణలో భారీ దెబ్బ.అందుకే ఈ విషయంలో ఈసీ నిర్ణయమే కేసీఆర్, గులాబీ పార్టీకి అత్యంత కీలకం.

అందుకే ఈసీకి పేరు మార్పుపై ప్రతిపాదన పంపిన కేసీఆర్ విలేకరులతో నిన్న మాట్లాడలేదు. ఈసీ గుర్తింపు వచ్చాక పార్టీ పేరు అధికారికంగా మారిన తర్వాత జెండా, అజెండా వివరించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసీ ఇలా తొలిదశలోనే అభ్యంతరాలు చెప్పడంతో ఈ వ్యవహారం ఏమవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.