Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు ఆ డేట్ చాలా ముఖ్యం!

By:  Tupaki Desk   |   3 Oct 2018 4:40 AM GMT
తెలంగాణ‌కు ఆ డేట్ చాలా ముఖ్యం!
X
ముంద‌స్తుకు వెళ్లాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు వేగంగా సాగిపోవ‌టం తెలిసిందే. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత బంతి ఈసీ కోర్టులో ప‌డింది. ఎన్నిక‌లు అన్నంత‌నే.. ఇట్టే జ‌రిగిపోవు. దానికి ముందు భారీ క‌స‌ర‌త్తు ఉంటుంది. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఓట‌ర్ల జాబితాను ప్ర‌క‌టించ‌టం.. ఆ త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంటుంది. మ‌రి.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాన్ని ఈసీ ఎప్పుడు ప్ర‌క‌టిస్తుంది? అన్న‌ది ఇప్పుడు అంద‌రిలో మెదులుతున్న ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌.

దీనికి స‌మాధానం వెతికితే.. ఈ నెల 12న ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రో తొమ్మిది రోజుల వ్య‌వ‌ధిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే వీలుంద‌ని చెబుతున్నారు. 12వ తేదీనే ఎందుకు ప్ర‌క‌టించే వీలుంది? ఆ రోజుకున్న ప్ర‌త్యేక‌త ఏమిటి? అన్న‌ది దానికి లాజిక్ చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

ఎన్నిక‌ల‌కు కీల‌క‌మైన ఓట‌ర్ల జాబితా ఈ నెల 8 నాటికి ప్ర‌క‌టిస్తారు. ఇది జ‌రిగిన రెండు మూడు రోజుల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న ఉంది. ఒక‌సారి ప‌రిస్థితి అంతా సంతృప్తిక‌రంగా ఉంటే.. వెంట‌నే ఈసీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవకాశం ఉంది.

దీనికి మ‌రో కార‌ణం లేక‌పోలేదు. సాధార‌ణంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తి మంగ‌ళ‌వారం.. శుక్ర‌వారం స‌మావేశం అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్న లెక్క‌లో.. ఎనిమిదిన ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేస్తే.. ఆ త‌ర్వాతి రెండు.. మూడు రోజుల‌కు అంటే ప‌ది.. ప‌ద‌కొండు తేదీల్లో ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌భ్యులు రాష్ట్రంలో ప‌ర్య‌టించి.. ఎన్నిక‌ల‌కు ఉన్న అనుకూల వాతావ‌ర‌ణం ఏమిట‌న్న‌ది మ‌దింపు చేస్తారు.

ఆ వెంట‌నే అంటే.. 12న శుక్ర‌వారం కావ‌టం గ‌మ‌నార్హం. ఆ రోజున య‌థావిధిగా ఈసీ స‌మావేశం ఉంటుంది కాబ‌ట్టి.. అప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం స‌భ్యులు తెలంగాణ రాష్ట్రంలో త‌మ ప‌ర్య‌ట‌న‌ను ముగిస్తారు కాబ‌ట్టి.. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల అంశాన్ని ప‌రిశీలించి.. దానిపై చ‌ర్చించే అవకాశం శుక్ర‌వారం జ‌రిగే మీటింగ్‌ లో ఎక్కువ‌గా ఉంది. ఎన్నిక‌ల్ని మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే ముందే నిర్వ‌హించాల‌న్న సంకేతాలు బ‌లంగా వ‌స్తున్న నేప‌థ్యంలో 12న తెలంగాణ ఎన్నిక‌లకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు అంశాలు వెలువ‌డాల్సి ఉంది. అందులో ఒక‌టి ఎన్నిక‌ల స‌న్న‌ద్ద‌త అంశం. మ‌రొక‌టి ఎన్నిక‌ల షెడ్యూల్. ఒక‌వేళ అన్నీ ఓకే అనుకుంటే స‌న్న‌ద్ద‌త బాగుంద‌ని చెప్పి.. ఎన్నికల షెడ్యూల్ ప్ర‌క‌టించే వీలుంది. అయితే.. దీనికి త‌క్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇక‌.. రెండో ప‌ద్ద‌తిలో స‌న్న‌ద‌త గురించి సంతృప్తి వ్య‌క్తం చేయ‌టం ద్వారా ఆ మీటింగ్ ముగించి.. త‌ర్వాతి స‌మావేశంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించే వీలుంది.

ఏమైనా.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం ఈ నెల 12న జ‌రుగుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు సైతం ఈ తేదీన ఏదో ఒక కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌న్న మాట‌ను న‌మ్ముతున్నాయి. మొత్తంగా చూస్తే.. ద‌స‌రాకు ముందే రాష్ట్రంలో రాజ‌కీయ వేడి మ‌రో లెవ‌ల్‌కు వెళ్ల‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.