Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుకు ఈసీ షాక్

By:  Tupaki Desk   |   27 April 2016 4:57 AM GMT
కేసీఆర్ సర్కారుకు ఈసీ షాక్
X
తెలంగాణ రాష్ట సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించాలంటూ టీఆర్ ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే.. ఈ విషయం అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్.. ఎస్పీలను తక్షణమే బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. కొత్త కలెక్టర్.. ఎస్పీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఖమ్మంలో తెలంగాణ అధికారపక్షం నిర్వహిస్తున్న ప్లీనరీ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహిస్తున్నారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యాక.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీఆర్ ఎస్ ప్లీనరీ ఎలా నిర్వహిస్తుందన్నది కాంగ్రెస్ నిలదీస్తోంది. దీనికి టీఆర్ ఎస్ చెబుతున్న సమాధానం ఏమిటంటే.. తాము ప్లీనరీని ఖమ్మంలో నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని.. అందుకు తగ్గ ఏర్పాట్లు ఉప ఎన్నిక నోటిపికేషన్ విడుదల కాకముందే చేస్తున్న నేపథ్యంలో తాము ప్లీనరీ జరుపుకోవటానికి వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ అధికారుల్ని కోరటం.. వారు కొన్ని పరిమితులతో ఓకే చెప్పటం తెలిసిందే.

ఈ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయి.. కేంద్ర ఎన్నిక సంఘానికి ఫిర్యాదుచేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై గంటల వ్యవధిలో స్పందించిన ఈసీ.. ఖమ్మం జిల్లా కలెక్టర్.. ఎస్పీలపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. వారిస్థానంలో నియమించాల్సిన అధికారులకు సంబంధించి ముగ్గురేసి చొప్పున జాబితా పంపాలని కోరింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ముగ్గురు పేర్లను పంపిన తెలంగాణ ప్రభుత్వం పంపింది. అలా పంపిన పేర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిశోర్ ను కలెక్టర్ గా.. ఎస్పీగా ఆర్.రెమా రాజేశ్వరిని నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల వేళ.. ఉప ఎన్నిక నిర్వహణకు అనుమతిచ్చిన ఖమ్మం కలెక్టర్.. ఎస్పీలపై వేటుపడిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.