Begin typing your search above and press return to search.

మ‌రో ఎదురుదెబ్బ‌: టీవీ9 భార‌త్ వ‌ర్ష్ కు ఈసీ హెచ్చ‌రిక‌!

By:  Tupaki Desk   |   10 May 2019 9:59 AM GMT
మ‌రో ఎదురుదెబ్బ‌:  టీవీ9 భార‌త్ వ‌ర్ష్ కు ఈసీ హెచ్చ‌రిక‌!
X
కొన్నిసార్లు అంతే. అదే ప‌నిగా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూ ఉంటాయి. మొన్న‌టి వ‌ర‌కూ టీవీ9 ర‌విప్ర‌కాశ్ అంటే ఎంత ప‌వ‌ర్ ఫుల్లో అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి ఆయ‌న‌.. ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. క‌ట్ట‌క‌ట్టుకొని క‌ష్టాలు ఇంటికి వ‌చ్చిన‌ట్లుగా ర‌విప్ర‌కాశ్ ప‌రిస్థితి ఉంది.

టీవీ9 ఛాన‌ల్ గ్రూప్ ను అలందా మీడియా సంస్థ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. ఇంత‌కూ ఈ అలందా మీడియా ఎవ‌ర‌దంటారా? ఇంకెవ‌రు.. మైహోం గ్రూప్.. మెగా గ్రూపుకు చెందిన ప్ర‌ముఖుల‌తో కూడిన క‌న్సార్టియంగా చెప్పాలి. దాదాపు 90 శాతం వాటాలు చేజిక్కించుకున్న త‌ర్వాత కూడా త‌మ‌కు తోచిన‌ట్లుగా ఛాన‌ళ్ల‌ను న‌డుపుకోకుంటే ఎలా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. మ‌రోవైపు త‌మ సంస్థ‌లో మోసం జ‌రిగిన‌ట్లుగా వారికి అనిపించ‌టం.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వ‌టం.. ఆ వెంట‌నే జ‌ర‌గాల్సిన ర‌చ్చ జ‌రిగిపోయింది.

నిత్యం సంచ‌ల‌న క‌థ‌నాల్ని టెలికాస్ట్ చేసే టీవీ9.. ఇప్పుడో సంచ‌ల‌న క‌థ‌నంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌విప్ర‌కాశ్ కు మ‌రో త‌ల‌నొప్పి ఎదురైంది. టీవీ9 భార‌త్ వ‌ర్ష్ ఛాన‌ల్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఘాటు వార్నింగ్ ఇచ్చింది.ఈవీఎంలు.. వీవీ ప్యాట్ లు మాయం అయ్యాయంటూ త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈవీఎంల భ‌ద్ర‌త‌.. త‌ర‌లింపు అంశాల‌పై అత్యున్న‌త స్థాయి నిఘా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసిన ఈసీ.. త‌ప్పుడు రిపోర్టింగ్ చేయ‌కుండా పాత్రికేయ ప్ర‌మాణాలు కాపాడాల‌ని హిత‌వు ప‌లికింది. ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేయొద్ద‌ని ఈసీ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. ఈసీ నుంచి హెచ్చ‌రిక అందుకోగానే.. స‌ద‌రు ఛాన‌ల్ లో ప్ర‌సారం చేసిన ఈవీఎంల క‌థ‌నాల్ని తొల‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చి ప‌డుతున్న ఇబ్బందులు ర‌విప్ర‌కాశ్ కు ఉక్కిరిబిక్కిరి చేయ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.