Begin typing your search above and press return to search.

దేశంలో ఎక్కడున్నా ఓటు వేసే వీలు..త్వరలో రానుందా?

By:  Tupaki Desk   |   13 Feb 2020 6:00 AM GMT
దేశంలో ఎక్కడున్నా ఓటు వేసే వీలు..త్వరలో రానుందా?
X
ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆత్రుత పడేవారు ఎంతో మంది ఉంటారు. అదే సమయంలో.. ఓటు మీద కనీస ఆసక్తిని ప్రదర్శించని వారూ ఉంటారు. ఓటు వేయాలన్నా.. తీరిక లేని పనులు.. ఇతరత్రా ముఖ్యమైన కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఓటు వేయలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మాత్రం బాధ వేస్తుంది. అలా అని ముఖ్యమైన పనులు వదులుకొని ఓటు వేయలేక బాధ పడుతుంటారు. సామాన్యుల విషయంలో ఇలా ఉంటే.. ప్రముఖుల విషయంలో మరో తలనొప్పి మొదలైంది.

ఇటీవల కాలంలో పెరిగిన మీడియాతో సెలబ్రిటీలు.. ప్రముఖులు ఎవరు ఓటు వేస్తున్నారు? వేయటం లేదన్న విషయం మీద ఆసక్తి పెరగటమే కాదు.. వారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో చర్చించుకునే పరిస్థితి. ఇలాంటివేళ.. కొందరు తమకు పనులున్నా.. వాటిని ఆపుకొని ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది.

దీనికి భిన్నంగా దేశంలో ఎక్కడున్నా.. ఏ పనిలో ఉన్నా ఓటు వేసే సౌకర్యం ఉంటే? ఎలా ఉంటుందన్న ఆలోచనే భలేగా ఉంటుంది. మరి.. దాన్ని అమలు చేసేందుకు వీలుగా కసరత్తు చేస్తే ఎలా ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోడా మాట్లడుతూ.. దేశంలో ఎక్కడున్నా ఓటు వేసే సౌకర్యం మీద ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

దీనికి సంబంధించిన కసరత్తు మొదలైందన్న విషయం ఆయన మాటల్లో చెప్పకనే చెప్పేశాయి. ఐఐటీ మద్రాస్ సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను డెవలప్ చేసి.. ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడున్నా ఓటు వేయటం అంటే.. ఆన్ లైన్ లో ఓటు వేసే సౌకర్యం ఎంత మాత్రం కాదని చెప్పారు. మరి.. ఈ మాట వాస్తవ రూపంలోకి దాలిస్తే.. పోలింగ్ శాతం మరింత పెరగటం ఖాయం.