Begin typing your search above and press return to search.

అమెరికాలో రాజుకుంటున్న 'వేడి'..!

By:  Tupaki Desk   |   4 Jan 2023 5:54 AM GMT
అమెరికాలో రాజుకుంటున్న వేడి..!
X
అమెరికాలో ఒకవైపు మంచు తుఫానులో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మాత్రం రాజకీయాలు హీట్ పుట్టించేలా మారుతున్నాయి. అమెరికా గత అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై స్వల్ప మెజార్టీతో జో బైడెన్ విజయం సాధించారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీని చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత రిపబ్లికన్లు కాస్తా డీలా పడిపోయారు. రెండేళ్లుగా స్తబ్దుగా ఉంటున్న రిపబ్లికన్లు ఇప్పుడు పార్లమెంటులో కీలకమైన ప్రతినిధుల సభలో మెజార్టీని దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మద్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల కంటే ఎక్కువ స్థానాలు రిపబ్లికన్లు సాధించారు. దీంతో ప్రతినిధుల సభలో మంగళవారం నుంచి రిపబ్లికన్లు మెజార్టీతో కొత్త సభ కొలువుదీరింది.

ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా ఏకపక్షంగా సాగుతున్న అమెరికా రాజకీయాలు కొత్త మలుపు తీసుకోబోతున్నాయి. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వ బిల్లులు.. చట్టాలను అడ్డుకోవడంతో పాటు ప్రెసిడెంట్ బైడెన్ నిర్ణయాలు.. ఆయన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై విచారణకు రిపబ్లికన్లు డిమాండ్లు చేస్తుండటంతో అమెరికాలో రాజకీయ వేడి రాజుకుంటుంటోంది.

2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో రాబోయే రెండేళ్లలో జో బైడెన్ తీసుకోబోయే అనేక నిర్ణయాలపై పీటముడి పడే అవకాశం కన్పిస్తోంది. బైడెన్ యంత్రాంగ వ్యవహారాలు.. ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వ్యాపార కార్యకలాపాలు.. ఉక్రెయిన్ సంబంధాలు వంటి అంశాలు ప్రతినిధుల సభలో చర్చకు రానున్నాయి.

ఈ నేపథ్యంలోనే బైడెన్ పై అభిశంసన ప్రవేశ పెడుతామని కొంతమంది రిపబ్లికన్లు ఇప్పటికే ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ లో అమెరికా జెలన్ స్కీకి చేస్తున్న సాయం నిలిపివేసేలా రిపబ్లికన్లు ఆలోచిస్తున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా విచక్షణ రహితంగా సాయం చేస్తుందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.

అమెరిక్లను మాంద్యంలోకి నెడుతూ ఉక్రెయిన్ ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టి ఇవ్వడం మూర్ఖత్వమని వాదిస్తున్నారు. ఈ అంశాన్ని మధ్యంతర ఎన్నికల ముందు ప్రచారంగా రిపబ్లికన్లు వాడుకున్నారు. ఉక్రెయిన్ తోపాటు విదేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థికసాయంపై విచారణ జరుపుతామంటూ రిపబ్లికన్ నేతలు హెచ్చరిస్తున్నారు.

ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించి జోష్ లో ఉన్న ట్రంప్ బృందం రాబోయే రెండేళ్లలో బెడైన్ కు ముక్కుతాడు వేయాలని భావిస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్ ను సమర్థించే వారు.. వ్యతిరేకించేవారు ఉండటంతో ఆయనతో కలిసొచ్చే అంశాలపైనే ఈ రాజకీయం ఆధారపడి ఉండనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.