Begin typing your search above and press return to search.

మంత్రి ఇలాకా లో టీఆర్ఎస్ కు షాక్

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:52 AM GMT
మంత్రి ఇలాకా లో టీఆర్ఎస్ కు షాక్
X
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. కౌంటింగ్ లో టీఆర్ఎస్ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

అయితే మంత్రుల ఇలాకాలో మాత్రం వ్యతిరేక ఫలితం వస్తోంది. అక్కడ టీఆర్ఎస్ కు గెలుపు అంత ఈజీ కావడం లేదు. తాజాగా టీఆర్ఎస్ ను దాదాపు ఓడించనంత పని చేశారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం మంత్రి కొప్పుల సొంత నియోజకవర్గం. ఈ ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న చందంగా పోటీ కొనసాగుతోంది. మంత్రి ఇలాకాలో వచ్చిన షాకింగ్ ఫలితం టీఆర్ఎస్ ను కలవర పాటుకు గురి చేసింది.

మంత్రి కొప్పుల ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందాయి. కేవలం 1 వార్డులో ఆధిక్యాన్ని ప్రదర్శించి టీఆర్ఎస్ చావుతప్పి కన్నులొట్ట బోయిన చందంగా బతుకుజీవుడా అంటూ బయట పడింది. టీఆర్ఎస్ మంత్రి కొప్పుల పరువు కాపాడింది.

అయితే ఇప్పుడు గెలిచిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకోవడంతో ధర్మపురిలో గులాబీ జెండా ఎగురుతుందా లేదా అన్న టెన్షన్ మంత్రిని పట్టిపీడిస్తోంది. మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ ఇంత టైట్ గా గెలవడం టీఆర్ఎస్ లో కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి కొప్పుల కూడా కేవలం 500ఓట్ల లోపు మెజార్టీతోనే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు. ఈ మున్సిపల్ ఫలితాలు కూడా ఆయనకు షాకిచ్చాయి. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ వశమవుతుందా అనే టెన్షన్ మాత్రం వెంటాడుతోంది. ఇరుపార్టీలు ఇక్కడ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.