Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:46 AM GMT
బిగ్ బ్రేకింగ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
X
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే దొడ్డిదారు ‘ఉత్తరప్రదేశ్’లో గెలవడం.. ఇప్పుడు అందరి చూపు యూపీలో గెలుపు ఎవరిది? అని.. రైతుల నిరసనతో బొప్పికట్టిన బీజేపీని ప్రజలు మరోసారి గెలిపిస్తారా? యోగి పాలనకు మరో అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా మోగడంతో అందరి చూపు యూపీపైనే పడింది.

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తోపాటు కీలకమైన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కొద్దిసేపటి క్రితమే శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో పోలింగ్ జరుపనున్నట్లు కేంద్రం ఎన్నికల కమిషనర్ తెలిపారు. మార్చి 10న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. యూపీలో 7 దశల్లో .. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏదో ఈ ఎన్నికలతో తేటతెల్లం కానుంది. ఎందుకంటే ప్రజల నాడి తెలిసిపోతోంది. అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఎవరు అధికారంలోకి వస్తే వారిదే ఢిల్లీ పీఠం.. సో ఈ రాష్ట్రం అత్యంత కీలకం.

ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 403, ఉత్తరాఖండ్ లో 70, పంజాబ్ లో 117, గోవాలో 40, మణిపూర్ లో 60 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

దేశంలో కోవిడ్ 19 పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలతో ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కీలక ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు.

శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు.

కీలకమైన ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో తొలి ఓటు వేసే వారు ఏకంగా 24.98 లక్షల మంది ఉన్నారు. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. 16శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. మొత్తం పోలింగ్ బూత్ ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీచే అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు.