Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నిక‌లు.. అక్టోబ‌రు 2023లోనే.. లాజిక్ ఇదే!

By:  Tupaki Desk   |   20 Dec 2021 11:30 AM GMT
ఏపీలో ఎన్నిక‌లు.. అక్టోబ‌రు 2023లోనే.. లాజిక్ ఇదే!
X
ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడు? అన‌గానే అంద‌రూ చెప్పే స‌మాధానం 2024 అనే! ఎందుకంటే.. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక్క‌సారి మాత్ర‌మే ఎన్నిక‌లు జ‌రుగుతాయి కాబ‌ట్టి 2019 త‌ర్వాత‌.. వ‌చ్చే ఐదేళ్లకు 2024లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే.. ఇప్పుడు అలా జ‌రిగే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. దీనిక‌న్నా ముందుగానే జ‌గ‌న్ ఏపీలో ఎన్నిక‌లకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇదే ఆలోచ‌న ఆయ‌న చేస్తున్నార‌ని కూడా తెలుస్తోంది. దీనికి కార‌ణాలు కూడా కొన్ని తెర‌మీదికి వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌భావం ఎన్నికల్లో క‌నిపిస్తుంది. అయితే.. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వానికి మాత్రం ఒకేసారి ఎన్నిక‌లు వ‌స్తే.. కేంద్రంపై ఉన్న కోపం.. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో చూపించే అవ‌కాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇదే జ‌రిగింది. దీంతో కేంద్రం ఎన్నిక‌లు ఉన్న స‌మ‌యానికి రాష్ట్రాలు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయి. గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా 2019లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఆరు మాసాల ముందుగానే ఎన్నిక‌లు నిర్వ‌హించుకుంది.

అంటే.. 2018లోనే తెలంగాణ‌లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్రంపై ఉన్న వ్య‌తిరేక‌త త‌మ‌పై ప్ర‌భావం చూపించ‌కుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఇక‌, ఇదే మార్గంలో రాజ‌స్థాన్‌, ఒడిసా, ఇలా.. అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 2019లో మోడీ ఎఫెక్ట్ కార‌ణంగా.. ఆయా రాష్ట్రాలు ముందుగానే ఎన్నిక‌లకు వెళ్లాయి. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్లో కూడా మోడీ ఎఫెక్ట్ క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో 2024లో కేంద్రంతో పాటు.. ఏపీలోనూ సార్వ‌త్రిక స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనిని ముందుగానే నిర్వ‌హించుకుంటే.. త‌న పై మోడీ ప్ర‌భావం ఉండ‌ద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

మోడీపై ఉన్న వ్య‌తిరేక‌త 2024 ఎన్నిక‌ల్లో క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని.. మేధావులు కూడా లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశం ఉంది. ఇది ఏపీలోనూ.. క‌నిపిస్తే.. జ‌గ‌న్‌కు ప్ర‌మాద‌మే. దీనిని ముందుగానే ఊహించిన జ‌గ‌న్‌.. అలా బీజేపీ వ్య‌తిరేక‌త‌.. కాంగ్రెస్‌కు అనుకూలంగామార‌కుండా.. ఉండాలంటే.. త‌న‌ప్ర‌భుత్వం మ‌ళ్లీ కొలువుదీరాలంటే.. ముందస్తుకు వెళ్ల‌డ‌మే మంచిద‌ని భావిస్తున్నారు. నిజానికి మోడీపై.. జ‌గ‌న్‌కు మంచి ఫీడ్ బ్యాకు లేదు.

పైగా కాంగ్రెస్‌తో శ‌తృత్వం ఉంది. కాబ‌ట్టి.. నేష‌ల్ పార్టీల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదు. పైగా.. ఇరు పార్టీల‌తోనూ జ‌గ‌న్‌కు స‌ఖ్య‌త లేదు. ఈ నేప‌థ్యంలో ఒక‌రిపై ఉన్న వ్య‌తిరేక‌త మ‌రొక‌రికి అవ‌కాశంగామార‌కుండా.. ఉండాలంటే.. తాను ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం మంచిద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక‌, టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు కు రెండుపార్టీల‌తోనూ స‌ఖ్య‌త ఉండడం.. జ‌గ‌న్‌కు మ‌రింత క‌ల‌వ‌రంగా ఉంది. మోడీపై వ్య‌తిరేక‌త‌, లేదా కాంగ్రెస్‌పై సానుకూల‌త బాబుకు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఈ నేప‌త్యంలో ఇలాంటి ప‌రిస్థితిని తాను చేజేతులా క‌ల్పిస్తే.. తాను ఓడిపోయి.. చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంది. ఈ క్ర‌మంలోనే తాను ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం మంచిద‌ని.. అనుకుంటు న్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. అంటే.. 2024 మేలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను ముందుగానే 2023, అక్టోబ‌రులో నిర్వ‌హిస్తే.. త‌న‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. మ‌రోసారి గ‌ద్దెనెక్కొచ్చ‌ని ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.