Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌కు గ్లామ‌ర్ మిస్‌!

By:  Tupaki Desk   |   24 Feb 2018 5:57 AM GMT
రాజ్య‌స‌భ‌కు గ్లామ‌ర్ మిస్‌!
X
పెద్ద‌ల స‌భ ఏమిటి? గ్లామ‌ర్ ఏమిటి? అన్న సందేహం వ‌ద్దు. తాజాగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న రాజ్య‌స‌భ స‌భ్యుల లిస్ట్ చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో స‌హా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 58 రాజ్య‌స‌భ స‌భ్యులు త‌మ ప‌ద‌వీ కాలాన్ని ముగించుకునే రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది.

ప‌ద‌వీ కాలం పూర్తి కానున్న నేత‌ల్లో గ్లామ‌ర్ ఉన్న వారు కావ‌టం ఈసారి ప్ర‌త్యేక‌త‌. ఆ మాట‌కు వ‌స్తే.. ఇప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వారి గ్లామ‌ర్ ను పూడ్చ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఈసారి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వారిలో భార‌త‌ర‌త్న స‌చిన్ టెండూల్క‌ర్.. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమ‌ణులు రేఖ‌.. జ‌యాబ‌చ్చ‌న్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. సినీ..క్రీడారంగానికి చెందిన ఈ న‌లుగురు సాటి వచ్చే గ్లామ‌ర్ స‌భ్యులు స‌భ‌కు రావ‌టం క‌ష్ట‌మ‌నే మాట ఉంది.

త్వ‌ర‌లో ఖాళీ కానున్న 58 రాజ్య‌స‌భ స్థానాల‌కు మార్చి 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌.. కేర‌ళ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన జేడీయూ స‌భ్యుడు వీరేంద్ర‌కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదే రోజు ఉప ఎన్నిక జ‌రుగుతుంది. దీంతో.. మార్చి 23 త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా 59 మంది స‌భ్యులు రానున్నారు. 59 మందిలో అత్య‌ధికులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రానున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 10 మంది.. బిహార్‌.. మ‌హారాష్ట్రల నుంచి ఆరుగురు చొప్పున‌.. ప‌శ్చిమ‌బెంగాల్.. మ‌ధ్య ప్ర‌దేశ్ నుంచి ఐదుగురు చొప్పున రిటైర్ కానుండ‌గా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురు రిటైర్ కానున్నారు.

తాజాగా రిటైర్ కానున్న వారిలో ఎనిమిది మంది కేంద్ర‌మంత్రులు ఉండ‌టం గ‌మ‌నార్హం. వీరిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సామాజిక న్యాయం.. సాధికార శాఖ మంత్రి తాప‌ర్ చంద్ గెహ్లుత్‌.. ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్.. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి న‌డ్డా.. పెట్రోలియం మంత్రి ధ‌ర్మేంధ్ర ప్ర‌ధాన్.. న్యాయ‌శాఖామంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌.. స‌హాయ‌మంత్రులు పురుషోత్తం రూపాల‌.. మ‌న్ సుఖ్ ఎల్ మాండ‌వీయ‌లు ఉన్నారు.

వీరే కాక బీజేపీ సీనియ‌ర్ నేతలు విన‌య్ క‌టియార్.. భూపేంద్ర యాద‌వ్‌ లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. ఏపీ నుంచి చిరంజీవి.. రేణుకా చౌద‌రి.. దేవేంద‌ర్ గౌడ్‌.. తెలంగాణ నుంచి సీఎం ర‌మేష్.. రాపోలు ఆనంద‌భాస్క‌ర్ లు ఉన్నారు. ఆ మ‌ధ్య‌న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మృతి చెందటంతో అప్ప‌టి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. దానికి తాజాగా ఎన్నిక జ‌ర‌గ‌నుంది.