Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్రపతిని నిర్ణయించే ఎన్నికలు...?

By:  Tupaki Desk   |   13 Jan 2022 12:30 AM GMT
కొత్త రాష్ట్రపతిని  నిర్ణయించే ఎన్నికలు...?
X
దేశానికి కొత్త రాష్ట్రపతి ఎవరు అవుతారు. ఇది ఇపుడు చర్చగా ఉంది. ఈ ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత రాష్త్రపతి పదవీకాలం జూలై వరకూ ఉంది. రామ్ నాద్ కోవింద్ ని కేంద్రంలోని బీజేపీ తనకు ఉన్న పూర్తి బలంతో 2017లో నెగ్గించుకోగలిగింది. అప్పట్లో యూపీలో బీజేపీకి మొత్తం 403 సీట్లకు గానూనూ 325 సీట్లు దక్కాయి. అలాగే ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గాను 57 సొంతం చేసుకుంది. . అదే విధంగా ఇపుడు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా నాడు బీజేపీ పవర్ లో ఉంది. దీంతో నాడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ఎదురే లేకపోయింది. అయితే ఇపుడు సీన్ వేరేగా ఉంది అంటున్నారు.

నిజానికి రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ ఓట్లు కీలకం అవుతాయి. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ నెగ్గిన ఎమ్మెల్యేలకు రాష్ట్రపతిని ఎన్నుకునే ఓటు హక్కు ఉంటుంది. దీంతో బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ గతంతో పోలిస్తే బలహీనపడిందని అంటున్నారు. దాని ప్రభావం కచ్చితంగా రేపటి రాష్ట్రపతి అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనుందని అంటున్నారు.

దాంతో బీజేపీకు 2024 ఎన్నికల కంటే ముందు రాష్ట్రపతి ఎన్నిక అనే అగ్ని పరీక్ష ఉంది. దాని నుంచి బయటపడాలి, తాము ప్రతిపాదించిన అభ్యర్ధిని గెలిపించుకోవాలి అంటే కనుక కచ్చితంగా కనీసం మూడు రాష్ట్రాలలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాల్సి ఉంటుంది. తదుపరి భారత రాష్ట్రపతిని నిర్ణయించే అంశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలక పాత్ర పోషించనున్నాయి.

అంతే కాదు ఈ అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి చేదు ఫలితాలు వస్తే రాజ్యసభలో కూడా బలం బాగా తగ్గుతుంది. ఇలా బీజేపీ తక్కువ సీట్లు తెచ్చుకుంటే కనుక రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్ధిని విపక్షాలు ప్రతిపాదించడం ఖాయం. దాంతో కేంద్రంలోని బీజేపీకి అది చాలా ఇబ్బంది అవుతుంది. తమ వారే రాష్ట్రపతి భవన్ లో ఉంటే 2024 ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా తమకే అధికారంలో మొదటి చాన్స్ ఇస్తారని కూడా బీజేపీ ఆశలు ఉన్నాయి. మొత్తానికి అయిదు రాష్ట్రాల ఎన్నికలు చాలా అంశాలనే ప్రభావితం చేయబోతున్నాయి అని చెప్పాలి.