Begin typing your search above and press return to search.

చెబితే నమ్మరు కానీ.. రోడ్డు మీద ఈ ఏనుగుల గుంపు ఏపీలోనే

By:  Tupaki Desk   |   24 May 2021 9:30 AM GMT
చెబితే నమ్మరు కానీ.. రోడ్డు మీద ఈ ఏనుగుల గుంపు ఏపీలోనే
X
రోడ్డు మీద గజరాజులు. అది కూడా ఒకటో రెండో కాదు.. చిన్నా పెద్దా కలిపి దాదాపు రెండు డజన్ల వరకు. అడవిలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏనుగుల సంచారం మామూలే అయినా.. ఇలా రోడ్డు మీదకు ఇంత ధీమాగా వచ్చేయటం మామూలుగా సాధ్యం కాదు. అందుకు భిన్నంగా తాజాగా రోడ్డు మీద కనిపించిన ఏనుగుల గుంపు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడో మారుమూల ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్ రాష్ట్రాలోనిది కాదు. అచ్చంగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో అంటే నమ్మలేం. కానీ.. ఇది నిజం.

కరోనా నేపథ్యంలో ఏపీలో విధించిన కర్ప్యూ నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో మాదిరి రద్దీతో కాకుండా.. వాహనాలు తిరగకపోవటంతో పరిసరాలు నిశ్శబద్దంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అడవిలో ఉంటే గజరాజులు ఇలా బయటకు వస్తున్నాయి. తాజాగా పలమనేరు - గుడియాత్తం రోడ్డును 22 ఏనుగులు దాటిన వైనాన్ని అక్కడి ప్రజలు ఆసక్తిగా చూశారు. కొందరు వీటిని కెమేరాల్లో బంధించారు.

కర్ఫ్యూ కారణంగా వాహనాల సంచారం పూర్తిగా తగ్గిపోవటంతో గజరాజులు ఇలా బయటకు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇంత భారీగా ఏనుగుల గుంపు కనిపించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ గుంపులో ఉన్న చిన్న ఏనుగులకు.. పెద్ద ఏనుగులు రక్షణ కల్పిస్తూ.. వాటిని తమ మధ్యలో ఉంచుకొని తీసుకెళుతున్న వైనం అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.