Begin typing your search above and press return to search.

మస్క్.. మళ్లీ ఏసేశారు.. ఈసారి జనాభాపై..

By:  Tupaki Desk   |   23 May 2022 2:30 PM GMT
మస్క్.. మళ్లీ ఏసేశారు.. ఈసారి జనాభాపై..
X
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వార్తల్లో నిలవడం అంటే ఇష్టమేమో..? మొన్నటివరకు ట్విటర్ కొనుగోలుపై రకరకాల ట్విస్ట్ లు ఇచ్చిన ఆయన ఆ తర్వాత మరేదో కామెంట్లు చేశారు. భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెడితేనే రాయితీలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ఖండించారు. అసలు భారత్ లో తయారీ వీలుకాదనేలా ఇక్కడ ఫ్రాంచైజీల ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు. టెస్లా.. అమెరికా, చైనాల్లో మాత్రమే ఉత్పత్తవుతోంది. మూడో మార్కెట్ గా భారత్ లో తయారీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే, ముందుగా విదేశాల్లో తయారైన కార్లను భారత్ లో విక్రయిస్తామని తర్వాత భారత్ లో తయారీ ప్లాంట్ నిర్మిస్తామని టెస్లా చెబుతోంది. దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో టెస్లా అధినేత మస్క్.. చర్చనీయాంశమైన ట్వీట్ లు చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సైతం దీనికి దీటుగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా మస్క్ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడింది.

యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన.. పుతిన్ పై ఉడుకు

ముందుగానే అనుకున్నట్టు మస్క్ కు వివాదాల దురద ఎక్కువే. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అతడు.. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను బహిరంగంగానే ఖండించారు. అంతేకాదు.. ఉక్రెయిన్ కు స్పేస్ ఎక్స్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందేలా చూశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను జూడో ఫైట్ కు రమ్మంటూ ట్వీట్ ల ద్వారా కవ్వించారు. దీనికి రష్యా విదేశాంగ మంత్రి బదులిస్తే.. మస్క్ మరింత రెచ్చిపోయారు. పుతిన్.. కావాలంటే నాతో యుద్ధంలోకి ''నీ ఎలుగును తెచ్చుకో'' అంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు అధిక సంతానంపై..

అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ కొట్టిపారేశారు. ఇది అర్థం లేని అభిప్రాయమంటూ తోసిపుచ్చారు. 'తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. జనాభా రెట్టింపైనా..పర్యావరణం బాగానే ఉంటుంది. జపాన్‌లో జననాల రేటు అత్యల్పంగా ఉంది. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది.

నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం' అంటూ ఇటీవల ఓ సదస్సులో మాట్లాడుతూ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల మస్క్‌ జపాన్ జనాభా గురించి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో జపాన్‌ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతోంది.

2008లో జనాభా పెరుగుదల గరిష్ఠంగా నమోదైన జపాన్‌లో గతేడాది 6లక్షల జనాభా తగ్గిపోయింది. గతేడాది అక్కడ 8.3లక్షల జననాలు నమోదుకాగా 14.4లక్షల మరణాలు సంభవించాయి. ఇలా ప్రతిఏటా అక్కడ మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.

ప్రస్తుతం జపాన్‌ జనాభాలో 29శాతం మంది 65ఏళ్లకు పైబడినవారేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 14ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న జనాభా వాటా కేవలం 11.8శాతంగా ఉంది. ఇలా వృద్ధ జనాభా పెరుగుదలతోపాటు శ్రామిక శక్తి తగ్గిపోతుండడం జపాన్‌కు పెద్ద సవాలుగా మారింది.