Begin typing your search above and press return to search.

ఆ టెక్నాలజీ కనిపెట్టండి...రూ.730కోట్లు తీసుకెళ్లండి:ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   22 Jan 2021 9:40 AM GMT
ఆ టెక్నాలజీ కనిపెట్టండి...రూ.730కోట్లు తీసుకెళ్లండి:ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్
X
స్పెస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నిల్వ చేసే మెరుగైన, అత్యుత్తమ టెక్నాలజీని కనిపెడితే 100 మిలియన్ డాలర్లు ( అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.దాదాపు రూ.730కోట్లు) ఇస్తానని ప్రకటించారు.

పరిశ్రమలు, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రపంచం కర్బన ఉద్గారాల సవాళ్లను ఎదుర్కొంటోంది. దానివల్ల కాలుష్యం పెరిగిపోతూ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు ఎక్కువవుతున్నాయి. అయితే దాన్ని నిరోధించేందుకు, నిల్వ చేసేందుకు సరైన టెక్నాలజీ ఇంత వరకు లేదు. గాలిలో కార్బన్ ను తగ్గించే విషయంపై ఎక్కువ ఫోకస్ కూడా పెట్టలేదు. ఈ నేపథ్యంలో ఇక కర్బన ఉద్గారాలను ఒకచోట నిల్వ చేసే టెక్నాలజీ కోసం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. బెస్ట్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని కనుగొంటే నేను 100 మిలియన్ డాలర్లు డొనేట్ చేస్తా. వివరాలు వచ్చే వారం వెల్లడిస్తా అని మస్క్ ట్వీట్లు చేశారు.

కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ఉన్నారు. ఇటీవలే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను ఆయన అధిగమించారు. టెస్లా ఎలక్ర్టిక్ కార్లు సూపర్ సక్సెస్ అవడం, స్పేస్ ఎక్స్ విజయాలతో దూసుకుపోతుండడంతో మార్కెట్లో వాటి విలువ అమాంతం పెరిగింది. దీంతో మస్క్ అపర కుబేరుడయ్యారు. ఒకప్పుడు పే పల్ అనే ఇంటర్నెట్ పేమెంట్ సంస్థకు కో ఫౌండర్ గా ఉన్న మస్క్ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రపంచంలోని అత్యంత ధనికుడిగా ఎదిగారు.