Begin typing your search above and press return to search.

మస్క్.. ట్విటర్ కొనుగోలుకు నిధులు కూర్చింది ఎవరంటే..?

By:  Tupaki Desk   |   8 May 2022 11:30 AM GMT
మస్క్.. ట్విటర్ కొనుగోలుకు నిధులు కూర్చింది ఎవరంటే..?
X
అపర కుబేరుడు ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ పై మనసు పడి కొనుగోలు చేసేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ట్విటర్ కొనుగోలుపై మస్క్ కొన్నేళ్ల కిందటే కన్నేశారు. అప్పటినుంచి ప్రయత్నాలు సాగాయా? లేదా? తెలియదు కానీ.. గత నెలలో డీల్ మాత్రం కుదిరింది. రూ.3.50 లక్షల కోట్లు పెట్టి ట్విటర్ పిట్టను తన గూటిలోకి తెచ్చుకోబోతున్నారు టెస్లా అధినేత మస్క్.

అందరి వేళ్లూ ట్విటర్ పైనే.. అందుకే మస్క్ కళ్లు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు, వ్యాపార కుబేరులు అందరూ ఎక్కువగా వాడేది ట్విటర్ నే. ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో లేని సౌలభ్యం ట్విటర్ లో ఉండడమే దీనికి కారణం. వినియోగ సౌలభ్యం సాధారణ వ్యక్తులకు కొంత కష్టమైనా.. మరీ అసాధ్యమేమీ కాదు. అందుకే ట్విటర్ అందరి ఇంటి పక్షి అయింది. వాస్తవానికి ట్విటర్ లో ఇతర బిజినెస్ టైకూన్లలాగే నిన్న మొన్నటి దాకా ఎలాన్ మస్క్ కూడా చురుగ్గా ఉండేవారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలయ్యాక పుతిన్ ను ఎగతాళి చేస్తూ ట్వీట్లు కూడా చేశారాయన. అలాంటి ట్విటర్ ను ఇప్పుడు మస్క్ నే కొనుగోలు చేయనున్నారు.

లక్షల కోట్ల కొనుగోలులో భారతీయ సీఈవో భార్య మస్క్ ట్విటర్ కొనుగోలు లో కొంత హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఇందులో ట్విటర్‌లో అధిక స్టేక్‌ను కొనడం నుంచి..ఆ సంస్థ ప్రస్తుత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ తొలగింపు వరకు చర్చనీయాంశం అయింది. తనతో మేధో పరంగా కలిసిరాలేరనే వారిని తొలగించాలని మస్క్ భావిస్తున్నారన్న వార్తలూ వచ్చాయి. అందులోభాగంగానే పరాగ్ అగర్వాల్ పై వేటు వేస్తారని భావించారు. అయితే, ఇదంతా ట్విటర్ మస్క్ చేతికి వచ్చాక జరిగే పరిణామం. దానికిముందుగా ఏం జరిగిందో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు.

అసలు ట్విటర్ కొనుగోలులో ఎలన్‌ మస్క్‌ విజయవంతం అయ్యేందుకు పరాగ్‌ అగర్వాల్‌ భార్య వినీతా అగర్వాల్‌ కీలక పాత్ర పోషించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని కాలిఫోర్నియా మెన్‌లో పార్క్‌ కేంద్రంగా ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌ అనే సంస్థ వెంచర్‌ క్యాప్టలిస్ట్‌ (వీసీ) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే మెటాకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అదే సంస్థ ..ట్విటర్‌ను కొనేందుకు ఎల‌న్‌ మ‌స్క్‌కు 400 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టేందుకు అంగీక‌రించింది.

అయితే ట్విటర్‌లో పెట్టుబడుల అంశంపై వినీతా అగర్వాల్‌ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌కు వినీతా అగర్వాల్‌ జనరల్‌ పార్ట్‌నర్‌గా ఉన్నారు. దీంతో పాటు డ్రగ్స్‌ డెవలప్‌మెంట్‌, లైఫ్‌ సైసెన్స్‌ టూల్స్‌, డయోగ్నోస్టిక్స్‌, డిజిటల్‌ హెల్త్‌, రోగి సంరక్షణ కోసం ప్రత్యేక డేటాసెట్ లు వంటి హెల్త్‌ కేర్‌ విభాగంగా పెట్టుబడులు పెట్టే అంశంలో ముఖ్యపాత్రపోషిస్తున్నారు. ఇప్పుడు మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయడంలో ఆర్ధికంగా ఆండ్రీసీన్‌ హోరోవిట్జ్‌కు సాయం చేస్తుండడం, ఆ సంస్థకు జనరల్‌ పార్ట్‌నర్‌గా వినీతా అగర్వాల్‌ ఉండడం గమనార్హం. ట్విటర్‌ కొనుగోలులో ఎలన్‌మస్క్‌కు ఆర్ధికంగా సాయం చేయడంతో వినీతా అగర్వాల్‌ వార్తల్లో నిలుస్తున్నారు.

మరి పరాగ్ ఉంటారా? ట్విటర్ తన వశం అయ్యాక పరాగ్ అగర్వాల్ ను సీఈవోగా మస్క్ ఉంచుతారా? లేదా? అనేది చూడాలి. వాస్తవానికి మస్క్ తానే ట్విటర్ సీఈవో కావాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరిప్పుడు పరాగ్ భార్య పనిచేస్తున్న సంస్థ పెట్టుబడి సాయం వార్తలు వెలుగులోకి వచ్చినందున ఆయన ఏంచేస్తారో చూడాలి?