Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మస్క్ ట్వీట్.. బైడెన్ పై అలకనా?

By:  Tupaki Desk   |   3 March 2022 12:30 PM GMT
హాట్ టాపిక్ గా మస్క్ ట్వీట్.. బైడెన్ పై అలకనా?
X
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసుకున్న ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చిన్నవయసులోనే తనదైన ఆలోచనతో ఇవాళ ప్రపంచ కుబేరునిగా మారారు. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అమెరికాలో దూసుకుపోతోంది. మరికొన్ని దేశాలకు విస్తరించే పనిలో పడ్డారు మస్క్. అయితే ఇదంతా బాగానే ఉంది.

మస్క్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారని నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా బైడెన్ పై మస్క్ అలిగాడు... అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే...!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. స్టేట్ ఆఫ్ యూనియన్ తొలి ప్రసంగంలో ఆయన కార్ల తయారీ కంపెనీలైన ఫోర్డ్, జీఎం గురించి ప్రస్తావించారు. అమెరికాలో ఎలక్ట్రానిక్ కార్ల తయారీకి కృషి చేస్తున్నాయని కొనియాడారు.

అంతేకాకుండా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ లో కూడా పోస్ట్ చేశారు. అయితే ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యారు.

అమెరికాలో ఫోర్ట్ 11 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని బైడెన్ అన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని... 11 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. అలాగే జనరల్ మోటార్స్(జీఎం) కూడా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.

మిచిగాన్ లో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. అంతేకాకుండా 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు. ఈ వివరాలతోనే ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రసంగంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా గురించి స్పందించలేదు. ట్వీట్ లోనూ పేర్కొనలేదు.

బైడెన్ టెస్లా ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఎలాన్ మస్క్ అలకపూనారు కావొచ్చు. అందుకే టెల్సా పెట్టుబడులు, కల్పిస్తున్న ఉపాధిని ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు. టెస్లా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కోసం తీవ్రంగా శ్రమిస్తోందని... దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. అంతేకాకుండా భారీగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు.

ఫోర్డ్, జీఎంల పెట్టుబడులను కలిపినా దానికంటే రెట్టింపు ఉంటుందని వెల్లడించారు. ఈ వివరాలను వెల్లడిస్తూ మస్క్ రీట్వీట్ చేశారు. కాగా మస్క్ ట్వీట్ పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. జో బైడెన్ ట్వీట్ వల్ల మస్క్ హర్ట్ అయ్యారని కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.