Begin typing your search above and press return to search.

'కారు’చౌకగా అమ్మేస్తానన్న డీల్ కు యాపిల్ చీఫ్ నో చెప్పారట

By:  Tupaki Desk   |   24 Dec 2020 12:30 AM GMT
కారు’చౌకగా అమ్మేస్తానన్న డీల్ కు యాపిల్ చీఫ్ నో చెప్పారట
X
మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కార్ల తయారీతో ప్రపంచ మార్కెట్లో దూసుకెళ్తోంది ‘టెస్లా ఇంక్‌’ కంపెనీ. అయితే.. ఇదే కంపెనీని డబ్బుల్లేక అమ్మేయాలనుకున్నాడట కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఈ విషయాన్ని తనే ట్విటర్ ద్వారా వెల్లడించాడని ఇంగ్లీష్ మీడియా తెలిపింది.

‘యాపిల్’కు విక్రయానికి..
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ‘టెస్లా ఇంక్’ను టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ కంపెనీకి విక్రయించేందుకు సీఈవో మస్క్ సిద్దపడ్డారట. అయితే.. తనతో సమావేశమయ్యేందుకు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ నిరాకరించినట్లు మస్క్ వెల్లడించారు. ఇదంతా ఇప్పుడెందుకు చర్చకు వచ్చిందంటే.. 2024కల్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారును మార్కెట్లో విడుదల చేయాని ‘యాపిల్‌’ సంస్థ ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో.. గతంలో అమ్ముతానంటే కొనలేదనే అర్థంలో మస్క్ చేసిన ట్వీట్ కు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.

పదోవంతుకే..
మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్ధి సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలతో టెస్లాను విక్రయించాలని భావించిన మస్క్‌.. ఆ కంపెనీని అమ్మేందుకు టిమ్‌ కుక్‌ను సంప్రదించారు. కానీ.. యాపిల్ సీఈవో అందుకు అంగీకరించలేదట. సీన్ కట్ చేస్తే.. టెస్లా కంపెనీ ప్రస్తుతం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత విలువలో కేవలం పదో వంతుకే.. అంటే 60 బిలియన్‌ డాలర్లకే కంపెనీని విక్రయించేందుకు సిద్ధపడ్డాడట ఇంక్.

గడ్డు పరిస్థితులు...
ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్‌ ఆటో కంపెనీగా నిలుస్తున్న టెస్లా కంపెనీ.. మోడల్‌-3 కార్లను అభివృద్ధి చేసే సమయంలో (2017లో) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. కార్ల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు లేకపోవడంతో మస్క్‌ ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొన్నాడు. దీంతో.. త్వరలో కంపెనీ మూసేయబోతున్నామని ఉద్యోగులకు చెప్పేశాడట. అయితే.. ఆ తర్వాత కొద్ది వారలకే మన సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని మళ్లీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాడట. ఏం జరిగిందో? ఎలా జరిగిందో కానీ.. చెప్పినట్టుగానే సమస్యలు పరిష్కరించాడు మస్క్. ఇప్పుడు ఆ కంపెనీ కార్ల తయారీలో నెంబర్ వన్ గా ఉంది.

షేరు జోరు..
2017 నుంచి చూస్తే.. టెస్లా ఇంక్‌ షేరు 1400 శాతం ర్యాలీ చేసింది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు వార్తలతో ఈ వారం ‘యాపిల్‌’ షేరు బలపడగా.. టెస్లా షేరు డీలాపడినట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.24 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కాగా.. ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడిన టెస్లా కంపెనీ వరుసగా 4 త్రైమాసికాలలో లాభాలు ఆర్జించడం ద్వారా ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లో చోటు సంపాదించింది. తద్వారా అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే షేరు 700 శాతం ర్యాలీ చేయడం విశేషం! దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(విలువ) 607 బిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా ఆవిర్భవించింది. దీని వల్ల అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్ తర్వాత 150 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మస్క్ అవతరించడం గమనార్హం!

కానీ.. ఒక్కసారి ఆలోచించండి. మస్క్ తన కంపెనీని అమ్ముతానని ఆఫర్ ఇచ్చినప్పుడు యాపిల్ కొని ఉంటే.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది?