Begin typing your search above and press return to search.

ఎలాన్‌ మస్క్‌ ఆ ట్వీట్‌ తో కోకోకోలాకు ఉచిత ప్రచారం

By:  Tupaki Desk   |   20 May 2022 2:51 AM GMT
ఎలాన్‌ మస్క్‌ ఆ ట్వీట్‌ తో కోకోకోలాకు ఉచిత ప్రచారం
X
టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాన్‌ మస్క్‌ అప్పుడప్పుడు చమత్కారపూరితంగా చేసే ట్వీట్లు అందరినీ ఆయన వైపుకు తిప్పుకునేలా చేస్తాయి. పనిలో పనిగా ఆయన చేసే ట్వీట్లు ఆయా కంపెనీలకు వరంగా మారి.. ఆయా కంపెనీల షేర్లు జెడ్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆ ట్వీట్లతో తన సొంత కంపెనీ షేర్లను కూడా ఎలాన్‌ మస్క్‌ దెబ్బ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి.

తాజాగా ట్విట్టర్‌ను కొన్నాక ఏం కొనబోతున్నారని ఓ నెటిజన్‌.. ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించాడు. దానికి ఎలాన్‌ మస్క్‌ చమత్కారపూరితంగా ఆన్సర్‌ ఇచ్చాడు. కోకోకోలాలో కొకైన్‌ను కలిపి అందుబాటులోకి తీసుకురావాలని ఉందని ట్వీటేశాడు. ఇందుకోసం కోకోకోలా కంపెనీని కొనుగోలు చేస్తానని మస్క్‌ ఆ నెటిజన్‌కు ఆన్సరిచ్చాడు. దీంతో ఆ ట్వీట్‌కు భారీ సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి. ఈ ట్వీట్‌ ఏకంగా 4.8 మిలియన్ల లైకులు సాధించింది. అంతేకాకుండా బతికి ఉన్నవారిలో ఎక్కువ లైకులు సాధించిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది.

అయితే.. కోకోకోలాపై వేసిన ట్వీట్‌ను కూడా ట్విట్టర్‌పై విమర్శలకు వాడుకున్నాడు.. ఎలాన్‌ మస్క్‌. ట్విట్టర్‌ యాజమాన్యం ట్విట్టర్‌ యాక్టివ్‌ యూజర్లు 217 మిలియన్‌లు ఉన్నారని చెబుతోందని.. మరి తన ట్వీట్‌కు 4.8 మిలియన్ల లైకులే రావడం ఏంటని మస్క్‌ ప్రశ్నించాడు. కోకోకోలాపై తాను చేసిన ట్వీట్‌ జీవించి ఉన్నవారిలో ఇప్పటివరకు అత్యధిక లైకులు సాధించిన ట్వీట్‌ అని ట్విట్టరే పేర్కొంటుందని.. మరి 217 మిలియన్‌ల మంది ట్విట్టర్‌ వాడుతుంటే 4.8 మిలియన్ల లైకులే రావడం ఏంటని నిలదీశాడు. దీన్ని బట్టి ట్విట్టర్‌లో యాక్టివ్‌ యూజర్లు 2 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలుస్తోందని మస్క్‌ అంటున్నాడు.

ట్విట్టర్‌లో ఫేక్‌ అకౌంట్లతోపాటు ఫేక్‌ యూజర్లు కూడా ఉన్నారని ఎలాన్‌ మస్క్‌ తాజాగా విమర్శించాడు. ట్విట్టర్‌ యాజమాన్యం ఫేక్‌ ఖాతాలను ఐదు శాతం మాత్రమే అని చెబుతోందని.. అయితే దీనికి నాలుగు రెట్లు అదనంగా అంటే 20 శాతం ఫేక్‌ ఖాతాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఈ ఫేక్‌ ఖాతాల సంఖ్య తేలే వరకు తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేసేది లేదని మస్క్‌ మొండికేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ట్విట్టర్‌లో నిజమైన యూజర్ల సంఖ్య కూడా తేలితే కానీ తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేయబోనని ఖరాఖండీగా ఎలాన్‌ మస్క్‌ తేల్చిచెప్పాడు.

మరోవైపు ఎలాన్‌ మస్క్‌ తన తాజా ట్వీట్‌లో కోకోకోలాను ప్రస్తావించడంతో ఆ కంపెనీకి ఎక్కడలేని ఉచిత ప్రచారం చేకూరుతోంది. దీనిపై ఆ కంపెనీ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్‌ మస్క్‌. ఆయనను కొన్ని మిలియన్ల మంది సోషల్‌ మీడియాలో ఫాలో అవుతున్నారు. దీంతో మస్క్‌ ఏం కామెంట్‌ చేసినా అది క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయిపోతోంది.