Begin typing your search above and press return to search.

మస్క్ మదిలోని ట్విటర్ 2.0 కథేమిటో?

By:  Tupaki Desk   |   27 Nov 2022 4:30 PM GMT
మస్క్ మదిలోని ట్విటర్ 2.0 కథేమిటో?
X
ఇంటి నుంచి పని ఆలోచన మానుకోండి.. వారానికి 80 గంటలు పనిచేయండి.. లేదంటే రాజీనామాలకు సిద్ధపడండి.గూగుల్‌, యాపిల్‌ తమ యాప్‌ స్టోర్‌, ప్లే స్టోర్ ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తా ఈ మాటలు ఎవరివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.4.50 లక్షల కోట్లు పెట్టి ట్విటర్ ను కొనుక్కున్న ఎలాస్ మస్క్ వి. అసలు ఆయన ట్విటర్ ను ఏం చేయాలనుకుంటున్నారు. రోజుకు కోట్ల రూపాయిల నష్టంలో నడుస్తున్న సంస్థను మళ్లీ ప్రగతి బాట ఎలా పట్టించనున్నారు.

ట్విటర్ కొనుగోలుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.1.08 లక్షల కోట్లను ఎలా తిరిగి చెల్లించనున్నారు.? కంపెనీలో జరుగుతున్న అంతర్గత మార్పులను ఎలా సంభాళించనున్నారు. ఇవన్నీ ఆసక్తికర విషయాలు. అయితే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. మస్క్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నారు. కీలక అధికారులు వెళ్లిపోతున్న వేళ.. పెద్దపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజాలు చేరుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మస్క్ ఆదివారం ట్విట్టర్ 2.0 ఆలోచనను వెల్లడించారు. కొత్త యూజర్ సైన్‌అప్‌లు మునుపెన్నడూ లేనంత గరిష్ఠంగా ఉన్నాయని, ఇప్పుడు నియామకాలు జోరందుకున్నాయని చెప్పారు.

పోయినోళ్ల పోయారు.. కానీ,

మస్క్ ట్విటర్ కొనుగోలు తర్వాత పదివేల మందిని తొలగించారని చెబుతారు. అంటే సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. కానీ, ఇప్పుడు "ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ ఏస్‌లు ట్విటర్ లో చేరుతున్నారు" అని అంటున్నారు. ఉద్యోగులతో పంచుకున్న కొన్ని కంపెనీ స్లైడ్‌లను ఆయన షేర్ చేశారు. తదుపరి తరం ట్విట్టర్ వినో, వీడియోప్రకటనలపై దృష్టి పెడుతుందని చెప్పారు. "మేం నియామకాలు చేస్తున్నాం. యూజర్ యాక్టివ్ మినిట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి మరియు మానిటైజ్ చేయగల డైలీ యాక్టివ్ యూజర్‌లు (mDAUలు) క్వార్టర్-బిలియన్ మార్క్‌ను దాటారు" అని మస్క్ పేర్కొన్నారు. "ద్వేషపూరిత ప్రసంగ ముద్రలు తక్కువగా ఉన్నట్లుగా వివరించారు.

మోసాలు అధికంగా ఉన్నా.. తరువాత తగ్గుతాయని పేర్కొన్నారు. బ్లూ బ్యాడ్జ్‌తో ట్విట్టర్ 'వెరిఫైడ్'ని $8కి పునఃప్రారంభించిన తర్వాత, ఇప్పుడు ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMలు), లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇది "విశ్వసనీయ డిజిటల్ టౌన్ స్క్వేర్" లక్ష్యంగా వేస్తున్న అడుగుగా చెప్పారు. ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించకపోతే, విస్తృత శ్రేణి వీక్షణలు ఉంటాయని తెలిపారు. హింసను ప్రేరేపించే ఏ ఖాతా అయినా స స్పెన్షనే అని నొక్కి చెప్పారు.

ట్రంప్ ను అందుకే చేర్చుకున్నాం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధరణపైనా మస్క్ స్పందించారు. ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘించలేదని.. ‘‘అందరికీ న్యాయం’’ ఉద్దేశంలో ట్రంప్‌ను తిరిగి చేర్చుకున్నట్లు మస్క్ చెప్పారు. కాగా, ట్రంప్ ను చేర్చుకోవడంపై ఈ నెల 20న పోల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు మస్క్‌ మరో ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. ఒకవేళ గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు తమ యాప్‌ స్టోర్‌ ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ప్రత్యామ్నాయంగా తానే స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని తెలిపారు. యాపిల్‌, గూగుల్‌ల మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే.. వాటి యాప్ స్టోర్‌ల నుంచి ట్విటర్‌ ను తొలగించే అవకాశం ఉందని ట్విటర్‌ ట్రస్ట్‌, సేఫ్టీ విభాగం మాజీ అధిపతి యేల్‌ రోత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మస్క్‌ తాజా ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘యాపిల్, గూగుల్‌ తమ అప్లికేషన్‌ స్టోర్‌ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. మస్క్‌ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ తీసుకురావాలి. పక్షపాత వైఖరి, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడే ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌లను సగం అమెరికా వదిలేస్తుంది. పైగా అంగారకుడిపై వెళ్లేందుకు రాకెట్లు నిర్మించే మనిషికి.. చిన్నపాటి స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడం సులభమే!’ అని ఓ వినియోగదారు ట్వీట్‌ చేశారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ‘ఇటువంటి పరిస్థితి రాదని ఆశిస్తున్నా. కానీ, ఇదే జరిగి, వేరే అవకాశం లేకపోతే మాత్రం.. ప్రత్యామ్నాయ ఫోన్ తయారు చేస్తా’ అని చెప్పారు. ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. స్మార్ట్‌ఫోన్‌లలో మస్క్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని ఓ వినియోగదారు స్పందించారు. తనకు తెలిసి ఈ ప్లాన్ ఇప్పటికే అమల్లో ఉన్నట్లు భావిస్తున్నానని మరొకరు కామెంట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఎలాన్‌ మస్క్‌ పగ్గాలు చేపట్టాక ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతున్న విషయం తెలిసిందే.