Begin typing your search above and press return to search.

ట్విటర్ తో డీల్ మిస్.. ఎలాన్ మస్క్ కు కలిగే నష్టమెంత?

By:  Tupaki Desk   |   9 July 2022 4:08 AM GMT
ట్విటర్ తో డీల్ మిస్.. ఎలాన్ మస్క్ కు కలిగే నష్టమెంత?
X
అనుమానాలు నిజమయ్యాయి. ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన అపర కుబేరుడు.. ఎట్టకేలకు వెనక్కి తగ్గాడు. ట్విటర్ కొనుగోలు నుంచి తప్పుకున్నాడు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్ తనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న పేరుతో కొనుగోలు డీల్ నుంచి తాను తప్పుకున్నట్లుగా పేర్కొన్నారు. ట్విటర్ ను కొనుగోలు చేసుకునేందుకు 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకోవటం తెలిసిందే.

కంపెనీని కొనుగోలు సమయంలో ట్విటర్ తన నివేదికలో చెప్పినట్లుగా ఐదు శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నట్లుగా ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లదన్న విషయాన్ని ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. స్పామ్ ఖాతాలు అనుకున్న దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లుగా ఆయన వాదిస్తున్నారు. స్పామ్ విషయం లెక్క తేలే వరకు కొనుగోలు ఒప్పందం ముందుకు వెళ్లదని ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఎలాన్ మస్క్ తో విలీన ఒప్పందాన్ని అమలు చేయటానికి బోర్డు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఆలోచిస్తున్నట్లుగా ట్విటర్ ఛైర్మన్ బ్రెట్ టెయిలో చెబుతున్నారు. మస్క్ తో అంగీకరించిన ఒప్పందాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయటానికి ట్విటర్ బోర్డు కట్టుబడి ఉందని చెబుతున్నారు.

ఏదైనా కారణంతో డీల్ నుంచి తప్పుకున్నట్లైతే.. ఎలాన్ మస్క్ ఒక బిలియన్ డాలర్లు పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒక బిలియన్ డాలర్ల (మన రూపాయిల్లో 7,933కోట్ల మొత్తాన్ని) బ్రేక్ అప్ పెనాల్టీని కట్టాల్సి ఉంటుంది.

ఇంత భారీ మొత్తాన్ని ఎలాన్ మస్క్ కట్టేందుకు ముందుకు వస్తారా? అన్నది ప్రశ్న. తాను కొందామని అనుకున్నా.. తమకు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే తాను కొనుగోలు చేయనట్లుగా చెప్పి.. బిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించకుండా ఎలాన్ ఎత్తుగడ వేస్తారన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి సంబంధించి ట్విటర్ సంస్థ చర్యలు ఏ విధంగా ఉంటాయన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.