Begin typing your search above and press return to search.

ఢిల్లీ టు న్యూయార్క్ జ‌ర్నీ అర‌గంటే.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   30 Sep 2017 4:59 AM GMT
ఢిల్లీ టు న్యూయార్క్ జ‌ర్నీ అర‌గంటే.. ఎలానంటే?
X
దిల్‌ సుఖ్‌ న‌గ‌ర్ నుంచి అమీర్ పేటకు బైక్ మీద ఎంత‌సేపు ప‌డుతుందంటే.. మినిమం 45 నిమిషాలు ఖాయం. అదే బ‌స్సులో అయితే త‌క్కువ‌లో త‌క్కువ గంట‌. ఇక‌.. ట్రాఫిక్ జాం అయితే గంట‌న్న‌ర టు రెండు గంట‌లు. కానీ.. మ‌నిషి ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో స‌మూలంగా మార్పులు చేసే కీల‌క ప్ర‌క‌ట‌న‌ను చేశారు స్పేస్ ఎక్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ఎలాన్ మ‌స్క్‌. తాజాగా ఆయ‌న నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. మ‌నిషి జీవ‌న ప్ర‌యాణ ముఖ‌చిత్రాన్ని మొత్తంగా మార్చేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి.

తాజాగా ఆయ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య ఏమిటంటే.. ఢిల్లీ నుంచి న్యూయార్క్ సిటీకి కేవ‌లం అర‌గంట మాత్ర‌మే జ‌ర్నీ అని.. అందుకు త‌గిన రాకెట్‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు రాకెట్ వాడ‌తారు క‌దా? మ‌నుషుల ర‌వాణాకు రాకెట్ల వినియోగం ఎలా? అన్న సందేహం క‌లుగుతుందా? ఇలాంటి ఎన్నో సందేహాల‌కు స‌మాధానం ఇస్తున్నారు ఎలాన్ మ‌స్క్‌. తాము త‌యారు చేయ‌బోయే బీఎఫ్ ఆర్ ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో ఇది సాధ్య‌మ‌ని చెబుతున్నారు.

మ‌స్క్ మాట‌లు మ‌స్కా కొట్టించేలా ఉన్నాయ‌ని అస్స‌లు అనుకోన‌క్కర్లేదు. ఎందుకంటే టెస్లా పేరుతో విద్యుత్ కార్ల‌ను త‌యారు చేసే కంపెనీ ఇత‌గాడిదే. అంతేనా.. హైప‌ర్ లూప్ పేరుతో గంట‌కు 1300 కిలోమీట‌ర్ల వేగంతో గొట్టాల్లో ప్ర‌యాణించే స‌రికొత్త ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఆలోచ‌న చేసింది ఈ 46 ఏళ్ల అమెరిక‌నే. ఇప్ప‌టికే అంత‌రిక్షంలోకి వ‌స్తువుల ర‌వాణాలో కీల‌క‌భూమిక పోషిస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియాలోని ఆడిలైట్‌ లో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఖ‌గోళ స‌మాఖ్య నిర్వ‌హించిన స‌ద‌స్సులో పాల్గొన్న మ‌స్క్.. త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు. మాన‌వ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మార్చేలా బీఎఫ్ఆర్ రాకెట్‌ను తాము అభివృద్ధి చేస్తామ‌ని.. ఇందులో ఉండే 40 కేబిన్ల ద్వారా ప్ర‌పంచంలోని ఏ మూల నుంచి ఏ మూల‌కైనా కేవ‌లం అర‌గంటలో గ‌మ్య‌స్థానాన్ని చేరుకోవ‌చ్చ‌న్నారు.

అంతేకాదు.. 2024 నాటికి మ‌నుషుల్ని ఆంగార‌క గ్ర‌హానికి పంపించి తీరుతాన‌ని చెబుతున్న మ‌స్క్‌.. అక్క‌డ కాల‌నీలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఐదేళ్ల‌లో అంగార‌కుడి వ‌ద్ద‌కు స‌ర‌కు ర‌వాణా వ్యోమ‌నౌక‌ల్ని పంప‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అంగార‌కుడి మీద‌కు మ‌నుషుల్ని పంపించే ప్రోగ్రాంకు అవ‌స‌ర‌మైన నిధుల స‌మ‌కూర్చుకునేందుకు అంత‌రిక్ష కేంద్రానికి రిపేర్లు చేయ‌టం.. చంద‌మామ వ‌ద్ద‌కు యాత్ర‌లు నిర్వ‌హించ‌టం లాంటి వాటితో అంగార‌క యాత్ర‌కు అవ‌స‌ర‌మైన నిధుల్ని స‌మ‌కూర్చుకుంటామ‌న్నారు. టోక్యో నుంచి ఢిల్లీకి 30 నిమిషాలు.. బ్యాంకాక్ నుంచి దుబాయ్‌కు 27 నిమిషాల్లో చేరుకోవ‌చ్చ‌న్న మ‌స్క్.. భూవాతావ‌ర‌ణం నుంచి బ‌య‌ట‌కు వెళితే.. ప్ర‌యాణం అత్యంత సాఫీగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌స్క్ మాట‌లు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి.. ఆయ‌న మాట‌లు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతాయో కాలం మాత్ర‌మే డిసైడ్ చేయ‌గ‌ల‌దు.