Begin typing your search above and press return to search.

ముంబై రైల్వే స్టేష‌న్‌ లో ఘోరం:27 మంది మృతి

By:  Tupaki Desk   |   29 Sep 2017 9:59 AM GMT
ముంబై రైల్వే స్టేష‌న్‌ లో ఘోరం:27 మంది మృతి
X
ద‌స‌రా మ‌హోత్స‌వాల వేళ ముంబై రైల్వే స్టేష‌న్‌ లో ఘోరం జ‌రిగిపోయింది. శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో మొత్తం 27 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 30 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెండు స్టేష‌న్ల‌ను క‌లిపే ఓ చిన్న‌పాటి వంతెన‌పై ప్ర‌యాణికులు వెళ్తున్న క్ర‌మంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వంతెన‌పై మృత‌దేహాలు చెల్లా చెదురుగా ప‌డ్డ‌తీరు ప్ర‌తి ఒక్క‌రిచేతా కంట త‌డి పెట్టించింది. ఎల్ఫిన్‌ స్ట‌న్ రోడ్ స్టేష‌న్ - ముంబై రైల్వే స్టేష‌న్‌ కు మ‌ధ్య ఉన్న ఈ వంతెన‌పై అత్యంత ర‌ద్దీ స‌మ‌యం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ తొక్కిస‌లాట చోటు చేసుకుంది.

ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మేర‌కు ఒకే సారి వివిధ దూర ప్రాంతాల నుంచి నాలుగు రైళ్లు స్టేష‌న్‌ కు చేరుకున్నాయి. ఇంత‌లోనే భారీ వ‌ర్షం ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ఈరైళ్ల‌ను ఎక్కేందుకు కొంద‌రు, ఈ రైళ్ల‌లో వ‌చ్చి ఇళ్ల‌కు చేరేందుకు కొంద‌రు ఈ వంతెన‌పై నుంచి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో న‌లుగురు అదుపుత‌ప్పి కింద ప‌డిపోయారు. దీంతో ప్రారంభమైన ఘోరం.. 27 మంది ప్రాణాలను పొట్ట‌న పెట్టుకుంది. ``రైళ్ల‌ను ఎక్కేందుకు ప్ర‌యాణికులు ప‌రుగులు తీసిన క్ర‌మంలోనే ఈ తొక్కిస‌లాట చోటుచేసుకుంది`` అని ప్ర‌త్య‌క్ష సాక్షి ఒక‌రు వెల్ల‌డించారు.

కాగా, ఈ దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కొన్ని గంట‌ల ముందు రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ ఇదే రైల్వే స్టేష‌న్‌ కు వ‌చ్చారు. ఈ స్టేష‌న్‌ లో కొత్త సేవ‌లు ప్రారంభించేందుకు గాను ఆయ‌న ఈ స్టేష‌న్‌ కు చేరుకున్నారు. అయితే, ఈ దుర్ఘ‌ట‌న అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌ని మంత్రి ట్వీట్ చేశారు. ఎల్ఫిన్‌ స్టోన్ రోడ్ స్టేష‌న్ ఫుట్ బ్రిడ్జ్‌ పై జ‌రిగిన దుర్ఘ‌ట‌న త‌న మ‌న‌సును క‌లిచి వేసింద‌ని అన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.