Begin typing your search above and press return to search.

గమ్మునున్న గుమ్మనూరు... ఇదేమి తీరు...?

By:  Tupaki Desk   |   16 April 2022 8:46 AM GMT
గమ్మునున్న గుమ్మనూరు... ఇదేమి తీరు...?
X
ప్రమాదాలు చెప్పిరావు. అయితే కొన్ని ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల వస్తాయి. సరే అవన్నీ తరువాత విచారణలో బయటపడతాయి. ప్రమాదంలో పోయేవి మాత్రం అమాయకుల విలువైన ప్రాణాలు. బతుకు తెరువు కోసం అక్కడ చేరి పనిచేసే వారి ఉసురు తీసేవి ఈ ప్రమాదాలు. తాజాగా చూస్తే ఏపీలో ఇటీవల పోరస్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. యావత్తు జనాలను ఉలిక్కిపడేలాచేసింది. ఏకంగా స్పాట్ లో ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఈ రోజుకు కూడా చావుబతుకుల పొరాటంలో మరి కొంతమంది ఉన్నారు.

ఈ ప్రమాదం జరగడంతోనే ప్రభుత్వం స్పందించింది. సంబంధిత అధికారులు కూడా బాగానే స్పందించారు. ఇక హోం మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తానేటి వనిత సైతం ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. మరో మంత్రి జోగి రమేష్ కూడా వెళ్ళి వచ్చారు. మరి ఇంతమంది కదిలినా ఏ మాత్రం స్పందన లేని ఒకే ఒక మంత్రి గుమ్మనూరు జయరాం అంటున్నారు. ఆయన నిజానికి కార్మిక శాఖ మంత్రి.

మొత్తం ప్రమాదానికి కారణమైన పోరస్ కంపెనీ కధ తేల్చాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కార్మిక మంత్రి. గతంలో కూడా ఆయన ఇదే శాఖను నిర్వహించారు. నాడు ఈఎస్‌ ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. నిజానికి జగన్ ప్రభుత్వంలో వచ్చిన అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే ఈ శాఖ మీదనే అని చెప్పాలి. నాడే ఆయన పదవి ఊడుతుందని అనుకున్నారు. వీలైతే విస్తరణలో తప్పిస్తారు అని కూడా భావించారు.

కానీ ఈ రెండూ జరగలేదు. కార్మిక మంత్రిగా మళ్లీ ఆయనే వచ్చి సీట్లో కూర్చున్నారు. దానికి కారణం ఆయన సామాజికవర్గం నుంచి వైసీపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కావడం. జగన్ సోషల్ ఇంజనీరింగ్, ఈక్వేషన్స్ వల్ల జయరాం మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. మరి ఇప్పటికి మూడేళ్ళుగా మంత్రిగా ఆయన ఉన్నారు. కొత్త అనుకోవడానికి లేదు.

జరిగింది చాలా పెద్ద ప్రమాదం. అయినా సరే మంత్రి గారు పట్టనట్లుగా వ్యవహరించడమే విశేషం. దీని మీదనే అధికార పార్టీతో పాటు విపక్షాల్లోనూ చర్చగా ఉంది. మరి మంత్రి గారికి తీరిక లేదా. లేక ఈ సంఘటన చాలా చిన్నదని ఆయన భావిస్తున్నారా అన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. దీని మీద టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యన్నపాత్రుడు అయితే మంత్రి తన సొంత ఊళ్ళో మంత్రి పదవి వచ్చిన సంబరాల్లో ఉన్నారని విమర్శించారు.

అంటే విలువైన ప్రాణాలు ఇక్కడ గాలిలో కలసిపోతే మంత్రిగా స్పందించని వారు జగన్ సర్కార్ కి అవసరమా అన్న చర్చ అయితే వస్తోంది. సామాజిక సమీకరణలు, ఇతర ఈక్వేషన్స్ చూసుకుని కొనసాగిస్తే చివరాఖరుకు చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సింది వైసీపీనే అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ హై కమాండ్ ఎలా ఆలోచిస్తుందో గుమ్మనూరు గప్ చుప్ కి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.