Begin typing your search above and press return to search.
ఎమర్జెన్సీపై పుస్తకం..అందరూ చదవాలన్న వెంకయ్య
By: Tupaki Desk | 25 Jun 2018 5:05 PM GMTఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్‌ను గట్టిగా విమర్శంచడానికి ఒక పాత పాయింట్ ఒక కొత్త వేదిక పై సరైన సమయంలో బీజేపీకి దొరికింది. ఎ సూర్యప్రకాశ్ రచించిన 'ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్* పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఎంత ఉప రాష్ట్రపతి అయినా ఆయన బీజేపీ మనిషేకదా. అందుకే వేదిక ఎక్కగానే తాను ఉపరాష్ట్రపతి అన్న విషయం కూడా మరిచిపోయి కాంగ్రెస్ మీద పడ్డారు.
ఎమర్జెన్సీ సమయంలో తాను 17 నెలల పాటు జైల్లో ఉన్నానని చెప్పిన వెంకయ్యనాయుడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అహంకారంతో విధించిన *ఎమర్జెన్సీ* గురించి ఈ తరానికి తెలియదని, వారందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 21 నెలలో దేశంలో విధించడం ప్రజాస్వామ్య హననం అన్నారు. దానికి ప్రజలు ఇందిరాగాంధీపై ప్రతీకారం తీర్చుకున్నారని వెంకయ్య అన్నారు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. ఎమర్జెన్సీ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో... తెలియని యువత ఈ పుస్తకం చదివితే తెలుస్తుందని - దీనిని తెలుసుకోవడం వల్ల ప్రభుత్వాలపై ప్రజలు ఓ కన్నేసి ఉంచే అవకాశం ఉంటుందన్నారు. ఊరికే ఓటేసి పక్కనుండటం సరికాదని, రాజకీయనాయకులను కంట కనిపెడుతూ అన్ని స్థాయిల్లో ప్రజలు భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని వెంకయ్య సూచించారు.
తాను మాత్రమే కాదని - జయప్రకాశ్ నారాయణ్ - బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయి - అద్వానీ సహా చాలామందిని జైల్లో పెట్టారన్నారు. జైలుకెళ్లడం వల్ల అపుడు నాకు మంచే జరిగిందని... విపక్ష నేతలు - రచయితలు - జర్నలిస్టులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో నరేంద్ర మోడీ ఆరెస్సెస్ ప్రచారకర్త గా ఉండేవారన్నారు. *అజ్ఞాతంలోకి వెళ్లి జైలులో ఉన్నవారి కుటుంబాలను ఆదుకునే విషయంలో మోడీ కీలక పాత్ర పోషించారని* సూర్యప్రకాశ్ తన పుస్తకంలో రాశారని వెంకయ్య తెలిపారు.
1975 ఎమర్జెన్సీపై ఫేస్ బుక్ లో స్పందించిన జైట్లీ ఇందిరాగాంధీని హిట్లర్ అన్నారు. ఇందిర - హిట్లర్ లు ఇద్దరూ ఎమర్జెన్సీని ఇష్టపడిన నేతలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను తీహార్ - అంబాలా సెంట్రల్ జైలులో ఉన్నానని ప్రస్తావించిన జైట్లీ ఎమర్జెన్సీ వల్ల లా ఫైనల్ ఇయర్ పరీక్షలకు కూడా వెళ్లలేకపోయానన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది... ఎమర్జెన్సీ సమయంలో మోడీ ఎక్కడా వినపడని పేరు. కానీ ఈ రోజు ఆవిష్కరించిన పుస్తకంలో చోటు దక్కించుకోవడం, వెంకయ్య స్వయంగా పుస్తకాన్ని ఆవిష్కరించడం - సందర్భం సృష్టించి ఇందిరాగాంధీని తాజాగా బదనాం చేయడం చూస్తుంటే... మోడీ బ్యాచ్ ఏ అవకాశాన్ని వదలడం లేదని అర్థమవుతోంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి చాలా పెద్ద చేసిన మాట నిజమే. కానీ దేశానికి ఆయువు పట్టు అయిన బ్యాంకింగ్ వ్యవస్థను ఇందిరాగాంధీ పటిష్టం చేసి చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటే మోడీ ఆ బ్యాంకింగ్ వ్యవస్థపై చావుదెబ్బ తీశారు. ఇందిర ఎమర్జెన్సీ విధించడానికి ఆమె మనస్తత్వమే దారితీసిందని చెప్పాలి. దానివల్ల ఎమర్జెన్సీ వంటి చెడు జరిగినా, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో కీలక నిర్ణయాలకు కూడా ఆమె మొండితనమే కారణం.