Begin typing your search above and press return to search.

ఎమర్జెన్సీ మీటింగ్ లు:అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి?

By:  Tupaki Desk   |   20 March 2022 6:30 AM GMT
ఎమర్జెన్సీ మీటింగ్ లు:అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సోమవారం శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునివ్వడం టీఆర్ఎస్ లో సంచలనమైంది. పైకి మాత్రం వడ్ల కొనుగోలుపై కేంద్రంపై ఫైట్ చేస్తామని చెబుతున్నారు. కానీ దీనివెనుక ఏదో పెద్ద కథే ఉందని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ ఏదో ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.

కేంద్రంతో ఫైట్ కు అయితే టీఆర్ఎస్ శాసనసభా పక్షం మీటింగ్ ఎందుకని అందరూ అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ పిలుపు ఇస్తే సరిపోతుందని.. కానీ కీలకమైన నిర్ణయం కోసమే తన ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటి అవుతున్నారని ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికే ఈ పిలుపు అని ఎక్కువమంది అనుమానిస్తున్నారు. ఆ నిర్ణయం అప్పటికప్పుడు ప్రకటించకపోయినా కొన్ని సంకేతాలు మాత్రం ఈ సమావేశంలో ఇస్తారని టీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆగస్టు తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ ఇన్నాళ్లు తెలంగాణలో నెరవేర్చని.. తనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటున్న వాటిని సరిచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి. ప్రకటనలు అమలు చేయాల్సి ఉంది.

ఇక కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని మరికొందరు అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ ఇష్టంగా లేరని చెబుతున్నారు. ఇంకా ఏడాదిన్నర ఉన్నందున కేటీఆర్ ను సీఎం చేసి సరైన సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదనే సలహాలు పార్టీలోని ఓ వర్గం నుంచి వస్తున్నాయి.

అప్పటికి కేటీఆర్ నిరూపించుకుంటారని.. సీన్ మారిపోయిందన్న అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

తాజాగా కేంద్రంపై వడ్ల పోరు చేయడం అనేది చెప్పుకోవడానికే కానీ.. అసలు విషయం మాత్రం రాజకీయమేనని ఎక్కువమంది టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో కేసీఆర్ ముందస్తుకు వెళతారా? లేక కేటీఆర్ ను సీఎం చేస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.