Begin typing your search above and press return to search.

చేతులు జోడించి.. రోడ్డు పొడుగునా నిలబడి మరీ కృతజ్ఞతలు

By:  Tupaki Desk   |   4 March 2022 5:30 AM GMT
చేతులు జోడించి.. రోడ్డు పొడుగునా నిలబడి మరీ కృతజ్ఞతలు
X
దేశ చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా ఎదుర్కొని ప్రతికూలతల్ని.. నిందలు ఎదుర్కొన్న వారు ఎవరైనా ఉన్నారంటే అది అమరావతి రైతులనే చెప్పాలి. సొంత భూముల్ని రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చి.. రాజధాని కోసం రోడ్ల మీదకు రావటమే కాదు.. పెయిడ్ ఆర్టిస్టుల పేరుతో అవమానాలకు గురి కావటం వారికి మాత్రమే చెల్లుతుందేమో?
తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పుకునే క్రమంలో.. అధికార పార్టీ నుంచి ఎదురైన చికాకులు.. చీత్కారాల్ని భరిస్తూ.. వారు వేసే నిందల్ని మోస్తూ.. తమ నిజాయితీని చాటుకునే ప్రయత్నంలో గాంధీ మార్గాన్ని నూటికి నూరుపాళ్లు అనుసరించిన వైనం మరెక్కడా సాధ్యం కాదేమో?

ఏపీ రాజధాని అమరావతిపై గురువారం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. తమ కృతజ్ఞతలు తెలిపేందుకు అమరావతి రైతులు.. మహిళలు వినూత్న రీతిలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు వెలువరించిన కీలక తీర్పు అనంతరం.. న్యాయమూర్తులు బయటకు వెళ్లే వేళ.. హైకోర్టు ప్రాంగణంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి.. రెండు చేతులు జోడించి.. తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

దాదాపు కిలో మీటర్ మేరకు రైతులు బారులు తీరి ఉండటం గమనార్హం. ఇప్పటివరకు శాంతియుతంగా తమ హక్కుల సాధన కోసం ఆందోళన చేసిన వారిపై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎక్కెసాలు చేసినోళ్లు.. ఇప్పటికైనా మాట మారిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చి రోడ్ల మీదకు వచ్చి ఏళ్లుగా న్యాయం కోసం ఆందోళన చేస్తున్న వారి విషయంలో ఇప్పటికైనా జాలిని ప్రదర్శించాలని కోరుతున్నారు.