Begin typing your search above and press return to search.

వైసీపీకి ఉద్యోగుల ఎఫెక్ట్.. పోస్ట‌ల్ బ్యాలెట్లు ఖాళీ!

By:  Tupaki Desk   |   17 Nov 2021 12:30 PM GMT
వైసీపీకి ఉద్యోగుల ఎఫెక్ట్.. పోస్ట‌ల్ బ్యాలెట్లు ఖాళీ!
X
ఏపీ అధికార పార్టీకి.. స్థానిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి దెబ్బే త‌గిలింది. లెక్క ప్ర‌చారం చూసుకుంటే.. మొత్తం 12 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అదేవిధంగా కొన్ని పంచాయితీల్లో వార్డుల‌కు, మునిసిపాలిటీల్లో వార్డుల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. సాధార‌ణంగా.. ఉద్యోగుల‌కు.. ముందుగానే పోస్ట‌ల్ బ్యాలెట్ నిర్వ‌హిస్తారు. ఇవి కూడా ఎన్నిక‌ల్లో కీల‌కంగా మార‌తాయి. ఉద్యోగులు ఎన్నిక‌ల విధుల్లో ఉంటారు క‌నుక‌.. వారికి పోస్ట‌ల్ బ్యాలెట్ అనుమ‌తి ఉంటుంది. దీంతో ఉద్యోగులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు.

అయితే.. సాధార‌ణంగా ఉద్యోగులు అదికారంలో ఉన్న పార్టీకి ఫేవ‌ర్‌గా ఓట్లేస్తారు. దీంతో వారి ఓట్ల‌పై కూడా అధికార పార్టీ ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఈ ద‌ఫా.. ఉద్యోగులు మాత్రం పోస్టల్ బ్యాలెట్లో పాల్గొన‌లేదు. వాస్త‌వానికి.. ఇక్క‌డ వారికి మ‌రో ఆప్ష‌న్ కూడా ఉంది. అధికార పార్టీకే ఓటు వేయ‌క‌పోయినా.. త‌మ‌కు న‌చ్చిన పార్టీకి ఓటేయొచ్చు. అయితే.. టీడీపీకి ఓటేస్తే.. అధికార పార్టీకి మ‌రింత ఆగ్ర‌హం వ‌స్తుంద‌ని భావించారో.. ఏమో.. అటు అధికార పార్టీని, ఇటు టీడీపీని కూడా ప‌క్క‌న పెట్టారు. ఇక‌, అధికార పార్టీని ప‌క్క‌న పెట్ట‌డంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా కొన్నాళ్లుగా ప్ర‌భుత్వానికి ఉద్యోగుల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధం న‌డుస్తోంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ త‌మ‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. కీల‌క‌మైన సీపీఎస్ ర‌ద్దు విష‌యంలో.. అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి.. కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు . ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోవ‌డంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన మ‌రో విష‌యం పీఆర్‌సీ. దీనిపైనా .. ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, త‌మ డీఏ సొమ్మును కూడా ప్ర‌భుత్వం వాడుకుంద‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. త‌మ‌కు క‌నీసం విలువ లేకుండా చేస్తోంద‌నే ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉద్యోగులు.. స్థానిక పోరులో త‌మ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోకుండా.. ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చార‌ని అంటున్నారు.

ఎక్క‌డిక‌క్క‌డ‌.. పోస్టల్ బ్యాలెట్ల‌ను ముందుగా లెక్కించే సంప్ర‌దాయం ఉంది. అయితే.. ఈ ద‌ఫా.. పోస్ట‌ల్ బ్యాలెట్లు ఖాళీగా ఉండ‌డంతో.. అధికారులు సైతం అవాక్క‌య్యారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు యథావిధిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కూడా కల్పించారు. కానీ కుప్పంలో మాత్రం ఎవరూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయలేదు. దీంతో ఉదయం కౌంటింగ్ ప్రారంబించిన ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిల్ గా నిర్ధారించారు. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అస్సలు పోల్ కాలేదు. ఇలాగే రాష్ట్రంలోని పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అరకొరగా పోలయ్యాయి. దీంతో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై చర్చ జరుగుతోంది.