Begin typing your search above and press return to search.

టెకీల‌ను కంపెనీలు ఇలా బెదిరించేస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 July 2017 5:09 AM GMT
టెకీల‌ను కంపెనీలు ఇలా బెదిరించేస్తున్నాయి
X
కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఐటీ ఉద్యోగం అంటే మహా క్రేజీ.. కానీ రానురాను పరిస్థితులు మారుతున్నాయి. అబ్బో ఐటీ అనే మాట నుంచి.. అమ్మో ఐటీ ఉద్యోగమా.. అనే దుస్థితి వచ్చేసింది. ఉద్యోగం ఎప్పుడూడుతుందో తెలియక, మానవవనరుల విభాగం (హెచ్‌ ఆర్) నుంచి బెదిరింపులు తాళలేక ఇప్పటికే విలవిలలాడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజీనామా చేయాల్సిందేనని బెదిరిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిని ఆ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజరు జరిపిన టెలిఫోన్ సంభాషణ ఇటీవల బయటకొచ్చి తీవ్రసంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని, అయితే మహారాష్ట్రలోని పుణెలో ఐటీ ఉద్యోగులకు ఒత్తిళ్లు - బెదిరింపులు సర్వసాధారణమయ్యాయని తెలుస్తోంది. రాజీనామా చేయాలని ఒత్తిడి చేయటమేగాక, బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్‌ ఆర్ విభాగం తమను బెదిరిస్తూ ఉంటుందని పుణెలోని పలువురు ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.

``విపరీతమైన ఒత్తిడి మధ్య జీవిస్తున్నాం, పనితీరులో ఇప్పటివరకు నాలుగుస్టార్లు వచ్చేవి. కానీ ఇటీవల నాలుగు టర్మ్‌ లలో మూడింట నాకు రెండుస్టార్లే వచ్చాయి. ఎందుకు ఒక్కసారిగా నా ప్రదర్శన ఇలా పడిపోయిందో నాకే అంతుబట్టటం లేదు. మా ఆఫీసులోనే ఎవరో కావాలని ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది నా కుటుంబ - సామాజిక జీవనంపై ప్రభావం పడుతోంది`` అని ఓ ఐటీ ఉద్యోగి చెప్పారు. ``రాజీనామా చేయకపోతే ఇలాంటివి మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కెరీర్ నాశనమవుతుంది. మిమ్మల్ని బ్లాక్‌ లిస్ట్‌ లో పెడుతాం. ఉద్యోగం నుంచి తొలిగిస్తామంటూ ఒత్తిడి చేస్తున్నారు`` అని ఆయన వాపోయారు. కంపెనీలు ఉద్యోగుల పూర్తివివరాలు దగ్గర పెట్టుకుని, తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి పత్రాలు ఇవ్వకుండానే, చివరకు మా అంతట మేమే రాజీనామా చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు అని పుణెకు చెందిన మరో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి తెలిపారు. ``హెచ్‌ ఆర్ విభాగానికి చెందిన నలుగురు ఉద్యోగులు నా చుట్టుముట్టారు. రాజీనామా చేయాలని కోరారు. ఇలా అడుగడం అన్యాయమని అన్నాను. దీంతో బెదిరించారు. ఉద్యోగం నుంచి తొలిగిస్తామని చెబితే.. ఎందుకో స్పష్టత ఇవ్వాలని కోరాను. దాంతో నాపై ఒత్తిడిపెంచారు`` అని 39 ఏళ్ల మరో ఐటీ ఉద్యోగి తన అనుభవాన్ని వివరించారు.

మీడియాకు తెలుస్తుందనే భయంతో హెచ్‌ ఆర్ విభాగం వారు.. ఓ పద్ధతి ప్రకారం ఉద్యోగులను తొలిగిస్తున్నారని ఐటీ నిపుణులు చెప్తున్నారు. ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇది వారి జీవనశైలిపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో నెలకొన్న పరిస్థితులు, ఐటీ మార్కెట్లో మందగమనం తదితర కారణాలతోనే ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవటానికి ఈ విధమైన పద్ధతులను అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.