Begin typing your search above and press return to search.

ఔను.నీర‌వ్ స్కాంలో మా ఉద్యోగుల‌దే త‌ప్పు

By:  Tupaki Desk   |   4 March 2018 5:01 AM GMT
ఔను.నీర‌వ్ స్కాంలో మా ఉద్యోగుల‌దే త‌ప్పు
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో జరిగిన భారీ కుంభకోణంలో కీల‌క ప‌రిణామం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కుంభకోణానికి వ్యవస్థాగత లోపాలు, వైఫల్యాలే కారణమని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ - ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా అంగీక‌రించారు. ఈ విష‌యంలో ఆయ‌న‌ విచారాన్ని వ్యక్తం చేశారు. తమ బ్యాంకు ఉద్యోగుల్లో కొందరు ఈ కుంభకోణ నిందితులతో కుమ్మకై తప్పుడు అండర్‌ టేకింగ్ లెటర్లు జారీచేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. పీఎన్‌ బీ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సునీల్ మెహతాను ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ కుంభకోణ కేసులో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ - మెహుల్ చోక్సీపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ ఏ) కింద దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఆరు గంటల పాటు సునీల్ మెహతాను ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. వ్యవస్థాగత వైఫల్యాలు - నిబంధనల్లో లోపాల వల్లనే పీఎన్‌ బీలో భారీ కుంభకోణం జరిగిందని - కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌ వేర్‌ కు - స్విఫ్ట్ ఇంటర్‌ బ్యాంక్ మెసేజింగ్ వ్యవస్థకు మధ్య సరైన లింకులు లేకపోవడమే ఇందుకు కారణమని సునీల్ మెహతా పేర్కొన్నట్లు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉండ‌గా...పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడి రూ.12,700 కోట్లు స్వాహా చేసిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ - ఆయన మామ మెహుల్ చోక్సీలకు ముంబైలోని పీఎంఎల్‌ ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్ట) ప్రత్యేక కోర్టు శనివారం నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్‌ బీడబ్ల్యూలను) జారీ చేసింది. గత నెలలో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సంస్థల్లో ఒకటైన ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు పీఎంఎల్‌ ఏ కోర్టు శనివారం ఈ నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. పీఎన్‌ బీ కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న నీరవ్ మోడీ - మెహుల్ చోక్సీలకు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ ఇంతకుముందు సమన్లు జారీచేసి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే క్రిమినల్ కేసులు నమోదు కావడానికి చాలా రోజుల ముందే దేశం నుంచి జారుకున్న నీరవ్ - చోక్సీ ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ గత నెల 27వ తేదీన పీఎంఎల్‌ ఏ కోర్టును ఆశ్రయించి నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. నీరవ్ - చోక్సీలకు తాము ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేశామని, అయితే ఈ సమన్లకు వారు స్పందించడం గానీ, విచారణకు హాజరు కావడం గానీ చేయలేదని ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ ఈ సందర్భంగా పీఎంఎల్‌ఏ కోర్టుకు వివరించింది.