Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ ...మరో భారీ ప్రయోగానికి సిద్దమైన చైనా !

By:  Tupaki Desk   |   3 Feb 2020 11:26 AM GMT
కరోనా ఎఫెక్ట్ ...మరో భారీ ప్రయోగానికి సిద్దమైన చైనా !
X
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి చైనా తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 25 దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా చైనా లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ మాత్రం కొంచెం అనారోగ్యంగా ఉన్నా కూడా కరోనా వచ్చిందేమో అని దేశ ప్రజలందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. అలాగే చైనా లో కరోనా వైరస్ తీవ్రత ప్రమాద స్థాయిని కూడా దాటిపోవడంతో ప్రస్తుతం చైనాలో ఉండటానికి కూడా ఇష్టపడటంలేదు. చైనా నుంచి వచ్చేవాళ్లను వైద్య పరీక్షలు చేసిన తర్వాతే మరోదేశంలో అడుగు పెట్టనిస్తున్నారు.

ఇదిలా ఉంటే చైనాలో పరిస్థితులు మరింత దారుణం గా ఉన్నాయి. ఉద్యోగాలకు భయంగా భయంగా వెళుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, కంపెనీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్పత్తి తగ్గకుండా.. కంపెనీలు నష్టపోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కాన్సెప్టు పూర్తిస్థాయిలో ఆచరణలోకి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయోగంగా చైనా ప్రయోగం నిలవనుంది.

మాములుగా ఉద్యోగులు సెలవుల్లో ఉన్నప్పటికీ అత్యవరసర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. దీన్ని వర్క్ ఫ్రమ్ హాలిడేస్ అంటుంటారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ దానికి భిన్నమైనది. ఏదో సాధారణ సెలవు రోజుల్లోనో, అనారోగ్యంగా ఉన్నప్పుడో ఆపీసులకు వెళ్లకుండా ఇంటి నుంచి ఆఫీసు వ్యవహారాలను చక్కబెట్టడం కాదు. మొత్తం సిబ్బంది ఆఫీసులకు వెళ్లకుండా అందరూ ఇళ్ల దగ్గర నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఉదయమే సిబ్బంది అందరూ వీడియో కాల్స్‌ లో సమాచారం అందుకుని.. ప్రాజెక్టు సిద్ధం చేసుకుని..దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటారు.

ఇంటినుంచే పనులు చకచకా జరిగిపోతుంటాయి. ఈ విధానం ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, క్రియేటివ్ రంగాలకు సరిపోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. షాంఘై, బీజింగ్, ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి కనపడుతోంది. కరోనా ప్రభావం తో చాలా మంది ఉద్యోగుల సెలవులను ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. దీంతో ఇంటి దగ్గర నుంచే పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.