Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ రోడ్డెక్క‌నున్న ఉద్యోగులు ఈ సారి తాడో పేడో ?

By:  Tupaki Desk   |   18 April 2022 4:33 AM GMT
మ‌ళ్లీ రోడ్డెక్క‌నున్న ఉద్యోగులు ఈ సారి తాడో పేడో ?
X
రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ మ‌రో స‌మ‌స్య‌లో ఇరుక్కోనున్నారు. ఇంత కాలం సీపీఎస్ పేరిట వేసిన క‌మిటీలు ఏమీ తేల్చ‌లేద‌ని తేలిపోయాక ఇక తాము రోడ్డెక్క‌డం ఒక్క‌టే శ‌ర‌ణ్యం అనుకునే దిశ‌లో ఉద్యోగులు మ‌రియు ఉపాధ్యాయులు ఆలోచిస్తూ సంబంధిత ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధం కావ‌డంతో మ‌ళ్లీ ఈ సారి ఏ విధ‌మ‌యిన ఉద్రిక్త‌త‌లు వ‌స్తాయో అన్న భ‌యంతో వైసీపీ వ‌ర్గాలు ఉన్నాయి. ఓ విధంగా ఈ స‌మ‌స్య‌ను సాధ్య‌మ‌యినంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని భావించిన‌ప్ప‌టికీ సీపీఎస్ కు సంబంధించినవ‌న్నీ ఆర్థిక ప్ర‌యోజనాల‌తో ముడిప‌డి ఉండ‌డంతో ఏ నిర్ణ‌యం కూడా తీసుకోలేక సీఎం స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆ రోజు ఉన్న ఆర్థిక ప‌రిస్థితులు క‌న్నా ఇప్పుడు ఇంకా దిగ‌జారి ఉన్నాయి క‌నుక ఇప్ప‌టికిప్పుడు తాను హామీ ఇచ్చినా ఒక‌వేళ నెర‌వేర్చ‌లేక‌పోతే ప‌రువు పోతుంద‌న్న భ‌యం కూడా వైసీపీ బాస్ ను వెన్నాడుతోంది.

అందుకే వీలున్నంత వ‌ర‌కూ ఉద్యోగ మ‌రియు ఉపాధ్యాయ సంఘాల‌తో మాట్లాడేందుకు, మ‌ధ్యే మార్గంగా ప‌రిష్కారం వెతికేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారాయ‌న. ఇందుకు సంబంధించి మంత్రుల క‌మిటీ (గ‌తంలో నియ‌మించారు) కూడా ఏమీ తేల్చ‌లేక‌పోయింది. అదేవిధంగా మాజీ సీఎస్ ట‌క్క‌ర్ ఇచ్చిన నివేదిక కూడా అమ‌లు చేయాలంటే ఆర్థిక భారం త‌ప్ప మ‌రొక్కటి కాదు. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున సానుకూల చ‌ర్య‌లు తీసుకునేందుకు తాత్కారం నెల‌కొని ఉంది.

అదే ఇప్పుడు ఉద్యోగ మ‌రియు ఉపాధ్యాయ వ‌ర్గాల ఆగ్ర‌హానికి ప్రధాన కార‌ణం అవుతోంది. పీఆర్సీ విష‌య‌మై తాము స‌ర్దుకుపోయినా సీపీఎస్ కు సంబంధించి మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం అన్న‌ది కుద‌ర‌ని ప‌ని అని సంబంధిత వ‌ర్గాలు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాయి. ఉద్య‌మం మ‌రింత ఉద్ధృతం చేస్తే స‌ర్కారు ప‌రువు పోవ‌డం ఖాయం అని కూడా వైసీపీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

ఈ నేప‌థ్యాన ఉద్యోగులు మ‌ళ్లీ రోడ్డెక్క‌నున్నారు అని అనేందుకు ఇప్పుడు ఓ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణే తార్కాణం కానుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ వేతన స‌వ‌ర‌ణ‌కు ప‌ట్టుబ‌ట్టిన ఉద్యోగులు ఇప్పుడు జ‌గ‌న్ కు మ‌రో స‌మ‌స్య‌గా మార‌నున్నారు. సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి రోడ్డెక్కి నినదించ‌నున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు స‌మావేశాలు అయి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ఉద్ధృతం చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఆ రోజు పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీని ఏ మాత్రం నెర‌వేర్చ‌క కాల‌హ‌ర‌ణం చేస్తున్న సీఎం జ‌గ‌న్ మ‌రియు ఆయ‌న బృందంపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు ఉద్యోగులు మ‌రియు ఉపాధ్యాయులు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు త‌గిన విధంగా బుద్ధి చెబుతాం అని నిన్న‌మొన్న‌టి వేళ జ‌రిగిన క్షేత్ర స్థాయి సమావేశాల్లో కూడా హెచ్చ‌రించారు. తాము అంతా ఆ రోజు ఏక‌మై జ‌గ‌న్ ను సీఎం చేయాల‌న్న సంక‌ల్పంతో ప‌నిచేసి, పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసి ముందస్తు సంకేతాలు పంపామ‌ని, కానీ ఆ రోజు పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీని ఆయ‌న నెర‌వేర్చ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా కొత్త ఉద్య‌మానికి పోరు గ‌ర్జ‌న అని పేరు పెట్టారు. ఈ నెల 18 నుంచి 25 వ‌ర‌కూ ద్విచ‌క్ర వాహ‌న ర్యాలీ ఉంటుంది.

రాష్ట్రం నాలుగు వైపుల నుంచి ఈ ర్యాలీ ఉంటుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18,2022) ఇచ్ఛాపురం (శ్రీ‌కాకుళం జిల్లా) నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ఇక్క‌డి నుంచి ఈ ర్యాలీ విశాఖకు చేరుకుంటుంది. అటుపై దీనిని అక్క‌డి ప్ర‌తినిధులు కొన‌సాగించి విజ‌య‌వాడ‌లో ముగిస్తారు. యూటీఎఫ్ నేతృత్వంలో జ‌రుగుతున్న ఈ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్.వెంక‌టేశ్వ‌ర్లు నేతృత్వం వ‌హిస్తారు.