Begin typing your search above and press return to search.

అటూ ఇటూ ఉద్యోగుల పోరుబాట‌

By:  Tupaki Desk   |   25 Jan 2022 10:30 AM GMT
అటూ ఇటూ ఉద్యోగుల పోరుబాట‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌భుత్వాల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అటు ఏపీలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన పీఆర్సీని వెన‌క్కి తీసుకోవాల‌ని.. ఇటు తెలంగాణ‌లో బ‌దిలీల కోసం తెచ్చిన 317 జీవోను స‌వ‌రించాల‌ని ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా త‌మ ప‌నుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల్సిన ఈ ఉద్యోగుల ప్ర‌భుత్వాల తీరుతో ఇలా రోడ్డుపైకి వ‌చ్చాయ‌ని విప‌క్షాలు అంటున్నాయి.
అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు ఉద్యోగుల ప‌ట్ల వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఏపీలో పీఆర్సీతో స‌హా 70 డిమాండ్ల కోసం ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌త కొంత‌కాలంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 23.29 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. కానీ ఈ పీఆర్సీతో వేత‌నాలు పెర‌గ‌క‌పోగా.. గ‌తంలో కంటే త‌క్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకుంటున్న ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు.

సీఎస్‌కు స‌మ్మె నోటీసు కూడా అందించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున చ‌ర్చ‌ల‌కు రావాలంటూ మంత్రులు ఆహ్వానించినా.. ఉద్యోగ సంఘాల నేత‌లు మాత్రం స‌సేమీరా ఒప్పుకోవడం లేదు. పీఆర్సీ జీవో ర‌ద్దు చేస్తేనే చ‌ర్చ‌ల‌కు వ‌స్తామంటూ తెగేసి చెబుతున్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు పీఆర్సీసి సాధ‌న స‌మితిగా ఏర్ప‌డి ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 6 అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

మ‌రోవైపు తెలంగాణ‌లో కొత్త జోన్ల వారీగా ఉద్యోగుల కేటాయింపులు.. బ‌దిలీలు వివాద‌స్ప‌దంగా మారాయి. క్యేడ‌ర్ కేటాయింపుల కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన జీవో 317ను స‌వ‌రించాల‌ని ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ జోవో కార‌ణంగా ఆందోళ‌న‌కు గురైన కొంత‌మంది ఉద్యోగులు మ‌ర‌ణించార‌ని కేసీఆర్‌పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

ఈ జీవోను స‌వ‌రించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దీక్ష‌కు దిగ‌డం.. దాన్ని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేయ‌డం.. జైలుకు త‌రలించ‌డం.. ఇలా రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. మ‌రోవైపు ఈ జీవో స‌వ‌ర‌ణ కోసం ఉద్యోగులు ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు.