Begin typing your search above and press return to search.

భయం లేని గ్యాంగ్ స్టర్ ని అలా చంపారు?

By:  Tupaki Desk   |   21 July 2022 10:38 AM GMT
భయం లేని గ్యాంగ్ స్టర్ ని అలా చంపారు?
X
పంజాబ్ లో గన్ కల్చర్ ఎక్కువ. అచ్చం అమెరికాలోలాగానే ఇక్కడ తుపాకులు ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయని టాక్. ఏకంగా కెనడా నుంచి దిగుమతి చేసుకొని అత్యాధునిక గన్స్ తో కొన్ని నెలల క్రితం ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్దూమూసేవాలను ఓ గ్యాంగ్ స్టర్ ముఠా హతమార్చింది. పగలు, ప్రతీకారాలతో అస్సలు భయం లేని ఈ గ్యాంగ్ స్టర్ లు మూసేవాలాపై బుల్లెట్ల వర్షం కురిపించి చంపేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. తుపాకులతో హీరోల్లా రెచ్చిపోయారు. కొందరిని పోలీసులు పట్టుకోగా ఇంకొందరు పరార్ అయ్యారు. భయం లేకుండా విచ్చలవిడిగా మనుషుల ప్రాణాలు తీస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ లను మాటు వేసి హతమార్చారు పోలీసులు.

ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మే 29న కొందరు ఆగంతకులు కాల్పులు జరపడంతో ఈ పాపులర్ సింగర్ మృతిచెందాడు. అయితే పంజాబ్ పోలీసులు సెక్యూరిటీని ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం విషాదం నింపింది. తాజాగా సిద్దూను చంపిన గ్యాంగ్ స్టర్లను పోలీసులు హతమార్చారు. అమృత్‌సర్‌లో నాలుగు గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇద్దరు హంతకులు మరణించారు.

సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రమేయమున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. దాదాపు నాలుగు గంటలకు పైగా పోలీసులు, గ్యాంగ్ స్టర్ల మధ్య ఈ కాల్పులు సాగాయి. సాయంత్రం 4 గంటలకు ముగిసిన ఆపరేషన్‌లో ఇద్దరు గ్యాంగ్ స్టర్ లు హతమయ్యారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ బాన్ వెల్లడించారు.

పంజాబ్ పోలీసు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ దీనిపై ట్వీట్ చేసింది, ‘సిద్దూ మూసేవాలా హత్య కేసులో ఆయనను చంపిన మన్‌ప్రీత్ మన్ను & జగ్రూప్ రూప ఇద్దరూ భారీ తుపాకులతో పోలీసులతో తలపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు ఏడీజీపీ ప్రమోద్ బాన్ ధృవీకరించారు. పోలీసులు సంఘటనా స్థలం నుండి భారీ మందుగుండు సామాగ్రిని, AK-47 స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసులు, ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గ్యాంగ్‌స్టర్లు హగ్రూప్ సింగ్ రూపా మరియు మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మను కుసా మరణించారు. ఎదురుకాల్పుల్లో గ్యాంగ్ స్టర్లు ఎక్కువ సేపు పోరాడారని పోలసీులు తెలిపారు. రూప, కుసా అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని భక్నా గ్రామంలోని భవనంలో దాక్కున్నారు. పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి, భవనం సమీపంలో ట్రాక్టర్, ట్రాలీ వెనుకాల నుంచి కవర్ చేసుకుంటూ కాల్పులు జరిపారు.. రెండు సాయుధ వాహనాలు, కొన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా మోహరించారు.

ఏడీజీపీ బాన్ పంజాబ్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ గ్యాంగ్‌స్టర్ల నుండి AK-47 , పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఒక బ్యాగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తుంది. ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్లను హతమార్చినందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ పోలీసులకు అభినందనలు తెలిపారు.

మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా కాల్చి చంపబడ్డారు. సిద్ధూ మూసేవాలా హత్యలో ఆరుగురు షూటర్లను పోలీసులు గుర్తించారు. వారిలో ఇప్పటికే ముగ్గురు షూటర్లు ప్రియవ్రత్ ఫౌజీ, కషీష్ మరియు అంకిత్ సిర్సాలను అదుపులోకి తీసుకున్నారు. కూసా ఏకే-47 రైఫిల్‌తో మూసేవాలాపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. తాజాగా ఎన్ కౌంటర్ లో అతడు మరణించాడు.

-సిద్దూ మూసేవాలా హత్యకు అసలు కారణం ఇదీ..పంజాబీ సింగ్ సిద్దూ మూసేవాలా హత్య కేసు ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతీకార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుబెట్టినందుకు ప్రతీకారంగానే సిద్దూను తన ముఠాసభ్యులు చంపినట్లు ఒప్పుకున్నాడు. దీనికి కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ సహకరించినట్టు తేలింది. మూసేవాలా హత్యకు సూత్రధారిగా గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చారు.ఇప్పటికే బిష్ణోయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.ఇక బిష్ణోయ్ తనతోపాటు గన్ ఫైరింగ్ లో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాడు. ఈ కేసులో ఇప్పటివరకూ 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.