Begin typing your search above and press return to search.

తొగాడియాను చంపే కుట్ర‌లో మ‌రో కోణం

By:  Tupaki Desk   |   18 Jan 2018 3:00 PM GMT
తొగాడియాను చంపే కుట్ర‌లో మ‌రో కోణం
X
ఆచూకీ తెలియకుండా పోయి - చివరకు అపస్మారక స్థితిలో దవాఖానలో కనిపించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌ పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా(62) మ‌రోమారు మీడియా ముందుకు వచ్చారు. మ‌ళ్లీ అదే రీతిలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నా గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తనకు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతున్నారని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పదేళ్ల‌ కిందటి పాతకేసులో త‌న‌ను టార్గెట్ చేసి...రాజస్థాన్ - గుజరాత్ పోలీసులు ఎన్‌ కౌంటర్‌ లో చంపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసిందని తొగాడియ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా మ‌రోమారు ఆయ‌న అవే వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని పేర్కొంటూ ప్రధాని మోడీకి - అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచి జాయింట్ కమిషనర్ జేకే భట్‌ కు మధ్య కొన్ని రోజులుగా జరిగిన కాల్ రికార్డులను బయటపెట్టాలని తొగాడియా డిమాండ్ చేశారు. ఆ కాల్ రికార్డులు బయటికొస్తే మరిన్ని వాస్తవలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. త‌న‌పై కుట్ర చేసింది ఎవ‌రో తేలుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు వీహెచ్‌ పీ ఈ అంశాన్ని సున్నితంగా చూస్తోంది. ఇంకా చెప్పాలంటే వీహెచ్‌ పీలో చీలిక వ‌చ్చింది. త‌మ ముఖ్య నేత‌కు ప్రాణ‌హానీ ఉన్న అంవాన్ని కొంతమంది వీహెచ్‌పీ నాయకులు లేఖల ద్వారా రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ద‌ృష్టికి తీసుకెళ్లారు. మ‌రోవైపు ఇంకొంద‌రు రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఘ్‌ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అప్పుడే వివాదం స‌ద్దుమ‌ణుగుతుంద‌ని భావిస్తున్నారు. ఇదిలాఉండ‌గా ఇంకోవ‌ర్గం మాత్రం అస‌లేమాత్రం స్పందించ‌కుండా ఉంటోంది. ఈ నెల 26ప అలహాబాద్‌ లో జరగనున్న మార్గదర్శక్‌ మండల్‌ - సంత్‌ ల సమావేశంలో ప్రవీణ్‌ తొగాడియా పాల్గొంటున్న‌ప్పటికీ....ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌ విషయాన్ని చర్చించరాదని ఏకంగా తీర్మానం చేసింది.

కాగా, బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైనప్ప‌టికీ వివిధ అంశాల్లో ఇర‌కాటంలో పడేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న శివ‌సేన తాజా ఉదంతంలో కూడా కాషాయ పార్టీనికి ఇర‌కాటంలో పెట్టేలా చేసింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ విష‌యంలో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది.