Begin typing your search above and press return to search.

తిరుమలలో అంతులేని అవినీతి... రమణ దీక్షితులు ఫైర్!

By:  Tupaki Desk   |   8 Dec 2022 11:30 PM GMT
తిరుమలలో అంతులేని అవినీతి...  రమణ  దీక్షితులు ఫైర్!
X
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచమలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఆలయం. అక్కడ నిత్యం వేలల్లో భక్తులు వస్తారు. ఎంతో సనాతన పద్ధతులు ధర్మంతో సాగే ఆలయ వ్యవహారాల మీద అక్కడ పనిచేసే వారే విమర్శలు చేస్తే అది కచ్చితంగా వివాదం అవుతుంది. ప్రచారంలోకి వస్తుంది. ఇక తిరుమల మొత్తం అంతులేని అవినీతి ఉందంటూ లేటెస్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ పెట్టినట్లుగా జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది.

తిరుమలలో అనేక కులాల వారు వివిధ రకాలైన సేవలు అందిస్తున్నారని, వారిని తొలగించారు అంటూ ఆయన పోస్టింగ్ పెట్టడంతో దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తిరుమలలో అనాదిగా 54 సంప్రదాయ వారసత్వ కులాలు వివిధ సేవలకు సంబంధించి పనిచేస్తున్నారని వెల్లడించారు. వారిని 30/87 చట్టంతో తొలగించారని మండిపడ్డారు. యాదవులు వెదురు బుట్టలు తయారు చేసేవారు, కుమ్మరులు, ముగ్గులు వేసేవారు, తోటమాలి పని చేసేవారు, స్వర్ణకారులు, నేత కారులు, వండ్రంగి పనివారు. స్వామి వారి పల్లకీ మోసే వారు. సేవలు చేసేవారు ఇలా అనేక మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వీరిని తొలగించడం అన్యాయమని అవినీతి రాజ్యమేలుతోందని, అందువల్లనే ఇలా జరిగిందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో విపరీతమైన అవినీతి ఉందని ఆయన చేస్తున్న ఘాటైన విమర్శలు నేరుగా టీటీడీ పాలకమండలికే సూటిగా తగిలేలా ఉన్నాయని అంటున్నారు. మరి తిరుమలలో అవినీతి అని నేరుగా గౌరవ ప్రధాన అర్చకుడు విమర్శలు చేయడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఇక గతంలో కూడా తిరుమలలోని అర్చక వ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని శక్తులు చూస్తున్నాయని ఇదే రమణ దీక్షితులు ఆరోపించారు. ఆ మీదట ఆయన కొద్ది సేపటికే తన ట్విట్టర్ లో దానిని డిలెట్ చేశారు. ఇక రమణ దీక్షితులు ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ గత టీడీపీ హయాంలో కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. ఆనాడు స్వామి వారి ఆభరణాలు విషయంలో ఆయన చేసిన ఆరోపణలు కూడా అతి పెద్ద వివాదాన్నే రేపాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఆయన మీద నాడు టీటీడీ పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. రమణ దీక్షితులకు గౌరవ ప్రధాన అర్చక పదవిని కట్టబెట్టింది. అలాగే ఆయనను ఆగమ శాస్త్ర సలహ మండలి సభ్యునిగా నియమించింది. మరి ఆయనకు ఎందుకు అసంతృప్తి వచ్చిందో లేక ఆయన చెబుతున్నది ఎంతవరకూ నిజమో చూడాల్సి ఉంది అంటున్నారు.

ఏది ఏమైనా రమణ దీక్షితులు చేసినట్లుగా ట్విట్టర్ లో వచ్చిన ఈ పోస్ట్ మాత్రం దుమారమే రేపుతోంది. దీని మీద టీటీడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక రమణ దీక్షితులు అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టింగ్ పెట్టారా లేక ఫేక్ అకౌంట్ తో ఆయన పేరు మీద ఎవరైనా పెట్టారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.