Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీపై శత్రు దేశం ప్రశంసలు!

By:  Tupaki Desk   |   17 Jan 2023 11:34 AM GMT
ప్రధాని మోడీపై శత్రు దేశం ప్రశంసలు!
X
మన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మరిచిపోకముందే మరో పొరుగు దేశం పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కిలో గోధుమ పిండి రూ.240కు చేరింది. రేషన్‌ దుకాణాల ఎదుట గోధుమ పిండి కోసం పాకిస్థాన్‌ ప్రజలు బారులు తీరుతున్నారు. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటాయి.

అమెరికా, ముస్లిం దేశాలు ఇతోధిక సాయం చేస్తున్నా పాకిస్థాన్‌ ఇంకా సుడిగుండంలోనే ఉంది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగత్రలు, అనుకోని వరదలు ఆ దేశ పుట్టి ముంచాయి. వరదలతో సగానికి పైగా జనాభా అప్పట్లో వరదల్లోనే చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో గోధుమ పంట మొత్తం వరదకు తుడిచిపెట్టుకుపోయింది. గోధుమలపైనే పూర్తిగా ఆధారపడ్డ పాకిస్థాన్‌ కు ఇది అశనిపాతంగా పరిణమించింది. దీంతో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పాక్‌ ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో దేశ దుస్థితిపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్‌ అప్పుల కోసం అడుక్కోవాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

రుణాల విషయమై మాట్లాడుతూ.. ఒక అణ్వస్త్ర అడుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని షెహబాజ్‌ షరీప్‌ వ్యాఖ్యానించారు. కాగా రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయని షెహబాజ్‌ షరీఫ్‌ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ అంతర్జాతీయంగా పలుకుబడిని పెంచుకుంటోందని పాకిస్థాన్‌ మీడియా ప్రశంసలు కురిపించింది. అన్ని రంగాల పెట్టుబడులకు భారత్‌ ను ప్రధాని మోడీ స్వర్గధామంగా తీర్చిదిద్దారని కొనియాడింది. ఈ మేరకు పాకిస్థాన్‌ లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు షెహ్‌జాద్‌ ఛౌద్రీ 'ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైబ్యూన్‌'కు వ్యాసం రాశారు.

భారత ప్రధాని మోడీ ఎంతో నైపుణ్యంతో విదేశీ విధానాన్ని కొనసాగిస్తున్నారని షెహ్‌ జాద్‌ అభినందించారు. తద్వారా భారతదేశ జీడీపీ 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగిందని వెల్లడించారు. భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తేవడంలో గతంలో ఎవ్వరూ చేయని పనిని మోదీ చేశారని షెహ్‌ జాద్‌ ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైబ్యూన్‌ కు రాసిన వ్యాసంలో అభినందనలు కురిపించారు.

కాగా భారత ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం పాక్‌లో వైరల్‌గా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో మోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ''పాక్‌ అహంకారాన్ని మేం దెబ్బకొట్టాం. వారు ప్రపంచమంతా తిరిగి బిచ్చమెత్తే స్థితికి తీసుకొచ్చాం'' అని పేర్కొనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ పరిస్థితి నాడు మోడీ వ్యాఖ్యానించినట్టుగానే ఉండటంతో ఆ వీడియో వైరల్‌ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.