Begin typing your search above and press return to search.

ఈసారి మాల్యా తప్పించుకోలేడట

By:  Tupaki Desk   |   19 July 2017 4:58 PM GMT
ఈసారి మాల్యా తప్పించుకోలేడట
X
ఇండియాలో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు స్పీడు పెంచాయి. సీబీఐ అధికారులు - ఈడీ అధికారులు ఇప్పుడు సరికొత్త అస్ర్తాలతో లండన్ వెళ్లారు. మాల్యా చేసిన నేరాలకు సంబంధించిన తాజా ఆధారాలతో ఈడీ - సీబీఐ కంబైన్డ్ టీం ప్రస్తుతం లండన్‌ లో అక్కడి అధికారులను కలవనుంది.

ఆధారలన్నిటినీ లండన్‌లోని క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ కు సమర్పించనుంది. దీంతోపాటు ఈడీ దాఖలు చేసిన చార్జీషీటు ఫైలును, అందులో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా చూపించనుంది. ఆధారాలు సమర్పించడమే కాకుండా సీపీఎస్‌ అధికారులకు మాల్యా కేసుపై సమగ్రంగా వివరిస్తారు కూడా.

నేరారోపణలు ఎదుర్కొంటూ తమ దేశంలో తలదాచుకుంటున్న ఓ వ్యక్తిని ఆ దేశానికి చెందిన అధికారులు తీసుకెళ్లాలంటే అందుకు చాలా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈడీ - సీబీఐ టీం అలా అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకున్నారు. ఇవన్నీ పూర్తయి క్రౌన్ సర్వీస్ అధికారులు సంతృప్తి చెందితే మాల్యా భారత్ కు రావాల్సిందే. ఈసారి తమ ప్రయత్నం విఫలం కాదని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి.