Begin typing your search above and press return to search.

పుట్టింటికి వ‌ర‌ల్డ్ క‌ప్ చేరేసింది విదేశీయులే!

By:  Tupaki Desk   |   15 July 2019 10:11 AM IST
పుట్టింటికి వ‌ర‌ల్డ్ క‌ప్ చేరేసింది విదేశీయులే!
X
క్రికెట్ పుట్టింటికి చింత తీరింది. తాను పుట్టిన గ‌డ్డ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌సారిగా ప్ర‌పంచ‌క‌ప్ సొంతం చేసుకోలేద‌న్న బాధ తీరిన‌ట్లే. క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ మొద‌లైన ఇన్నేళ్ల త‌ర్వాత తొలిసారి ఇంగ్లండ్ ప్ర‌పంచ‌క‌ప్ ను స‌గ‌ర్వంగా విజేత హోదాలో ప‌ట్టుకొని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన వారంతా విదేశీయులే కావ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి.

ఒక‌ప్పుడు ర‌వి ఆస్త‌మించ‌ని రాజ్యాధికారాన్ని అనుభ‌వించి.. ప్ర‌పంచాన్ని ఏలిన ఆంగ్లేయులు.. తాము క‌నుగొన్న ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును సొంతం చేసుకునే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ త‌డ‌బ‌డేవారు. తాజాగా అందుకు భిన్నంగా క‌ప్పును సొంతం చేసుకున్నారు. అయితే.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ అందుకోవ‌టంలో కీల‌క‌భూమిక పోషించిన వారంతా వల‌స‌జీవులే కావ‌టం విశేషం.

ఎక్క‌డిదాకానో ఎందుకు న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ గెలుపులో కీల‌క‌భూమిక పోషించిన బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్ లోనే. తాను పుట్టిన గ‌డ్డ‌ను తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌ట్టు గెలిచేలా వ్య‌వ‌హ‌రించారు. అంతేనా.. సూప‌ర్ ఓవ‌ర్లో స‌మ‌ర్థంగా బౌల్ చేసి.. ఇంగ్లండ్ గెలుపున‌కు కార‌ణ‌మైన ఆర్చ‌ర్ సొంత దేశం ఇంగ్లండ్ ఎంత మాత్రం కాదు. అత‌డిది వెస్టిండీస్. వ‌ల‌స‌లే ఇంగ్లండ్ కు ఈ రోజు ప్ర‌పంచ క‌ప్ అందేలా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌పంచ క్రికెట్ విజేత‌గా అవ‌త‌రించిన ఇంగ్లండ్ జ‌ట్టులో ఈ ఇద్ద‌రే కాకుండా మ‌రికొంద‌రు వల‌స‌జీవులు ఉన్నార‌ని చెప్పాలి. ఎక్క‌డి దాకానో ఎందుకు ఇంగ్లండ్ జ‌ట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ది ఇంగ్లండ్ ఎంత‌మాత్రం కాదు.. ఆయ‌న‌ది ఐర్లాండ్‌. మెరుగైన కెరీర్ కోసం ఇంగ్లండ్ కు వ‌చ్చిన అత‌డు.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే జ‌ట్టు కెప్టెన్ స్థానాన్ని సొంతం చేసుకోవ‌ట‌మే కాదు.. ప్ర‌పంచ‌క‌ప్ రాలేద‌న్న చింత‌ను ఇంగ్లిషోళ్ల‌కు తీర్చాడు. ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన జేస‌న్ రాయ్ ది కూడా ఇంగ్లండ్ కాదు. అత‌డిది ద‌క్షిణాఫ్రికా. ప‌దేళ్ల వ‌య‌సులో ఇంగ్లండ్ లోకి వ‌చ్చిన అత‌డు.. ఇంగ్లండ్ గ‌డ్డ మీదే క్రికెట్ ఓనామాలు నేర్చుకొని.. తాజాగా జ‌ట్టు గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి ఈ ప్ర‌పంచ క‌ప్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ తురుపుముక్క‌గా రాయ్ ను చెప్పాలి. 8 మ్యాచుల్లో 63.28 స‌గ‌టుతో 443 ప‌రుగులు సాధించాడు. ఇక‌.. స్పిన్న‌ర్లు మొయిన్ ఆలీ.. ఆదిల్ ర‌షీద్ లు పుట్టింది ఇంగ్లండ్ లోనే అయినా.. వారి కుటుంబాలు మాత్రం పాకిస్థాన్ నుంచి వ‌ల‌స రావ‌టం గ‌మ‌నార్హం. ఇలా.. నానాజాతి స‌మితిలా ప్ర‌పంచ దేశాల‌కు చెందిన స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టు ఇంగ్లండ్ కు ప్ర‌పంచ క‌ప్పును అందించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.