Begin typing your search above and press return to search.

టెస్టును వన్డేలా ఆడి.. కివీస్ పై ఇంగ్లండ్ అద్వితీయ గెలుపు

By:  Tupaki Desk   |   15 Jun 2022 3:30 AM GMT
టెస్టును వన్డేలా ఆడి.. కివీస్ పై ఇంగ్లండ్ అద్వితీయ గెలుపు
X
టెస్టుల్లో ఒక్క రోజులో 300 కొట్టడం కొంత కష్టమే.. ఇక నాలుగో ఇన్నింగ్స్ లో.. అది కూడా ఛేజింగ్ లో.. ఐదో రోజు 300 పరుగులు చేయడం అంటే మరీ కష్టం.. కానీ, దీనిని సాధ్యం చేసింది ఇంగ్లండ్. న్యూజిలాండ్ తో నాటింగ్ హామ్ లో జరిగిన రెండో టెస్టులో 500 ఓవర్లలో ఏకంగా 299 పరుగులు చేసి.. గెలుపొందింది ఇంగ్లిష్ జట్టు. అంటే.. ఓవర్ కు సరిగ్గా 6 పరుగులు చొప్పున చేసుకుంటూ వెళ్లింది. 3 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. వాస్తవానికి రెండో టెస్టు పూర్తిగా న్యూజిలాండ్ నియంత్రణలో సాగింది. కానీ, ఒక్కడి వల్ల ఆ జట్టు పరాజయం పాలైంది. ఆ ఒక్కడే ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో.

మామూలు టెస్టు కాదు.. రికార్డుల వేట నాటింగ్ హామ్ లో జరిగిన ఈ టెస్టు చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 553 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (190), బ్లండెల్ (106) సెంచరీలతో రాణించారు. అయితే, ఇంగ్లండ్ సైతం దీనికి దీటుగా ఆడి 539 పరుగులు చేసింది. ఓలీ పోప్ (145), మాజీ కెప్టెన్ జో రూట్ (176) శతకాలతో కదం తొక్కారు.

ఇక రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 284 పరుగులకే పరిమితం అయింది. మిచెల్ (62 నాటౌట్) రాణించినా మిగతావారు విఫలమయ్యారు. ఓవర్ నైట్ స్కోరు 224/7తో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ మరో 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ఎదుట 299 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.

72 ఓవర్లలో కొట్టాలంటే.. 50 ఓవర్లలోనే

72 ఓవర్లలో దాదాపు 300.. నాలుగో ఇన్నింగ్స్ లో టెస్టు ఐదో రోజు న ఇది ఏ జట్టుకైనా.. అది సొంత గడ్డపై ఆడినా చాలా కష్టం. కానీ, ఇంగ్లండ్ సాధించింది. అది అలవోకగా ఏమీ రాలేదు.

లక్ష్య ఛేదనలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/94) ధాటికి ఇంగ్లండ్ 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అద్భుత ఫామ్ లో ఉన్న రూట్ (3) సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు పోప్ (18) విఫలమయ్యాడు. కానీ, బెయిర్ స్టో సునామీలా విరుచుకుపడ్డాడు. 90 బంతుల్లోనే 7 ఫోర్లు, 14 సిక్స్ లతో 136 పరుగులు చేశాడు. 147 స్ట్రయిక్ రేట్ తో పరుగులు రాబట్టాడు. కివీస్ కు డ్రా అనే ఆనందం కాదు కదా..? గెలుపు ను కూడా దూరం చేశాడు. అతడికి కెప్టెన్ బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్, 4 సిక్సులు, 10 ఫోర్లు) అండగా నిలవడంతో ఇంగ్లండ్ విజయం సులభమైంది.

టెస్టు క్రికెట్ బతికే ఉంది..

టి20 లు వచ్చాక టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గిందనే వారు ఉన్నారు. కానీ, అది అవాస్తవం. సంప్రదాయ ఫార్మాట్ కు ఎప్పటికీ వన్నె తరగదని ఈ మ్యాచ్ రుజువు చేసింది. ఇరు జట్లు 500 పైగా పరుగులు చేయడం ఏమిటి? ఐదు రోజులు పోటాపోటీగా సాగడం ఏమిటి? అందులోనూ 4 వికెట్లను 100లోపు పరుగులకే కోల్పోయి.. డ్రా చేసుకుంటే చాలనే స్థితిలో చివరి రోజు 300 పరుగుల లక్ష్యాన్ని ఓ జట్టు అద్భుత రీతిలో ఛేదించడం ఏమిటి? టెస్టు మ్యాచ్ ల్లోని మజా మరేదేంట్లోనూ ఉండదనేది అందుకే.