Begin typing your search above and press return to search.

చంద్రబాబు, యనమలనూ విచారిస్తారా ?

By:  Tupaki Desk   |   21 Dec 2021 4:28 AM GMT
చంద్రబాబు, యనమలనూ విచారిస్తారా ?
X
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ ఐఏఎస్ లు ఇరుక్కునట్లే అనిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి కే. లక్ష్మీనారాయణ కేంద్రంగా కుంభకోణం దర్యాప్తు జరుగతున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ లో రు. 250 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందుకనే సీఐడీ+ఏసీబీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. తమ దర్యాప్తులో భాగంగానే అప్పటి సీఈవో, ఎండీ గంటా సుబ్బారావును అరెస్టు చేశారు.

డైరెక్టరుగా వ్యవహరించిన లక్ష్మీనారాయణను విచారించేందుకు సీఐడీ అధికారులు ఆయన ఇంటికి వెళితే అనారోగ్యమని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుండి లక్ష్మీనారాయణను విచారించేందుకు సీఐడీకి సాధ్యం కాలేదు. ఈయన ఐఏఎస్ అధికారిగా చాల హోదాల్లో పనిచేశారు. అయితే అప్పట్లో కీలకం గా వ్యవహరించిన మరో ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి డైరెక్టరుగా పనిచేసిన లక్ష్మీనారాయణను మాత్రమే పట్టుకోవటం ఏమిటంటే చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఇదే విషయమై కోర్టు విచారణ లో న్యాయ మూర్తి కూడా ప్రశ్నించారు. దాంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సీఈవో, ఎండీ గా పని చేసిన ప్రేమచంద్రారెడ్డి తో పాటు అప్పటి ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ కు కూడా సీఐడీ నోటీసులిచ్చింది. వీరిద్దరు కూడా ఐఏఎస్ అధికారులు గా వివిధ హోదాల్లో పని చేసి రిటైర్ అయినవారే. సీఐడీ వాలకం చూస్తుంటే చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐవైఎస్ కృష్ణారావుకు కూడా నోటీసులు ఇచ్చేట్లే ఉన్నారు.

ఎందుకంటే ప్రేమ చంద్రారెడ్డి, రమేష్ కు జారీచేసిన నోటీసుల్లో కృష్ణారావు ప్రమేయాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే ఆ నోటీసుల్లో చంద్రబాబు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమేయంపైన కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. మరి వీళ్ళిచ్చే సమాధానం మీదే సీఐడీ తదుపరి దర్యాప్తు ఆధారపడుంటుంది. అవసరమైతే చంద్రబాబు, యనమలకు కూడా నోటీసులిస్తారేమో చూడాలి.

సంబంధిత ఫైళ్ళ పై చంద్రబాబు, యనమల సంతకాలు లేకుండానే వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. కాబట్టే వీళ్ళద్దరిని కూడా విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. చంద్రబాబు, యనమల సంతకాలు లేకుండానే ఐఏఎస్ లు అన్ని కోట్ల రూపాయలను ఎలా మంజూరు చేశారన్నది సీఐడీ అనుమానం. ఫైళ్ళపైన అసలు చంద్రబాబు, యనమల సంతకాలు ఎందుకు లేవు అనేది ఇక్కడ కీలకమైంది. మరి నోటీసులకు వీళ్ళు ఏమి సమాధానం చెబుతారో చూడాల్సిందే.