Begin typing your search above and press return to search.

నీర‌వ్ మోడీ స్కాంలో తాజా అప్ డేట్స్‌

By:  Tupaki Desk   |   19 Feb 2018 7:46 AM GMT
నీర‌వ్ మోడీ స్కాంలో తాజా అప్ డేట్స్‌
X
దేశ ప్ర‌జ‌ల‌కు షాక్ త‌గిలే చేశాడు నీర‌వ్ ప‌టేల్. వేలాది కోట్ల రూపాయిల స్కాంను గుట్టు చ‌ప్పుడు కాకుండా కొన్నేళ్లుగా సాగించ‌టం ఒక ఎత్తు అయితే.. నిఘా సంస్థ‌ల‌కు సందేహం ఉన్న స‌మ‌యంలోనూ ప్ర‌ధాని మోడీతో పాటు దావోస్ స‌ద‌స్సులో క‌లిసి గ్రూప్ ఫోటో దిగ‌టం చూస్తే నీర‌వ్ స్థాయి ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మాల్యా ఉదంతం త‌ర్వాత నిఘా వ్య‌వ‌స్థ‌లు క‌ట్టుదిట్టంగా ఉన్న‌ట్లుగా చెబుతున్న‌ప్ప‌టికీ వారికి కించిత్ సందేహం క‌ల‌గ‌కుండా చేయ‌టంలో నీర‌వ్ త‌న శ‌క్తిసామ‌ర్థ్యాల్ని ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. అంతేనా.. త‌న భాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యానికి అంతా స‌ర్దేసుకొని.. విదేశాల‌కు వెళ్లిపోయిన వైనం చూస్తే.. అత‌గాడి ప‌క్కా ప్లానింగ్ అర్థ‌మ‌వుతుంది.

భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మీద న‌మ్మ‌కం త‌గ్గేలా చేసిన నీర‌వ్‌.. ఈ రోజు విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపేస్తున్నాడు. వేలాది కోట్లు పోగొట్టుకున్న బ్యాంకులు.. విచార‌ణ అధికారులు పోయిన సొమ్మును రాబ‌ట్ట‌టం ఎలా? అన్న‌ది త‌ల కొట్టుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం దాదాపు రూ.16వేల కోట్ల మేర స్కాం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై గ‌డిచిన నాలుగు రోజులుగా సాగుతున్న విచార‌ణ‌లో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన అంశాలు చూస్తే..

+ భారీ స్కాంకు కార‌ణ‌మైన నీర‌వ్ మోడీ సంస్థ‌ల‌తో పాటు ఆయ‌న మేన‌మామ మోహుల్ ఛోక్సీ అధ్వ‌ర్యంలో గీతాంజ‌లి గ్రూప్ న‌కు అనుబంధంగా ఉన్న 18 సంస్థ‌ల బ్యాలెన్స్ షీట్ల‌ను సీబీఐ చెక్ చేస్తోంది. బ్యాంకుల నుంచి ఈ డ‌బ్బు ఎలా మ‌ళ్లించారు? ఎక్క‌డ‌కు పంపారు? కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే నీర‌వ్ ఎల్ ఓయూల‌ను బ్యాంకులు ఎలా క్లియ‌ర్ చేశాయి? లాంటి ప్ర‌శ్న‌ల‌పై ద‌ర్యాఫ్తు సంస్థ‌లు దృష్టి సారించాయి.

+ నీర‌వ్ మోడీ గుట్టుమ‌ట్ల‌ను వెలికి తీసేందుకు ఈడీ.. ఐటీ శాఖ‌లు ఒక బృందంగా ఏర్ప‌డి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. నీర‌వ్ కు చెందిన దాదాపు 200 షెల్ కంపెనీలు.. బినామీ ఆస్తుల్ని ఇప్ప‌టికే సంస్థ గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు.

+ అక్ర‌మ లావాదేవీల‌తో కూడ‌బెట్టిన డ‌బ్బును స్థ‌లాలు.. బంగారం.. డైమండ్స్ రూపంలో బినామీ ఆస్తులుగా మార్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ నీర‌వ్‌ కు చెందిన 105 బ్యాంక్ అకౌంట్ల‌ను సీజ్ చేసిన‌ట్లుగా స‌మాచారం.

+ ఆదివారం రోజు కూడా ఢిల్లీ..బెంగ‌ళూరు స‌హా అన్ని న‌గ‌రాల్లోని మోడీ.. చోక్సీల ఆస్తుల‌పై ఈడీ దాడులు కొన‌సాగాయి. దేశ వ్యాప్తంగా 15 న‌గ‌రాల్లోని 45 చోట్ల జ్యువెల‌రీ షాప్స్‌.. త‌యారీ కేంద్రాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.20 కోట్ల మేర బంగారం.. వ‌జ్రాల్ని స్వాధీనం చేసుకున్న‌ట్లుగా స‌మాచారం.

+ రాయ‌పూర్ లో 4.. బెంగ‌ళూరులో 10.. ఢిల్లీలో 7.. ముంబ‌యి.. కోల్ క‌తాల్లో 5.. చండీగ‌ఢ్.. హైద‌రాబాద్ ల్లో 4.. ప‌ట్నా.. ల‌క్నో.. అహ్మ‌దాబాద్‌.. చెన్నై.. గువ‌హ‌టి.. శ్రీ‌న‌గ‌ర్‌.. గోవా.. జైపూర్.. జ‌లంధ‌ర్ బ్రాంచుల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు.

+ నీర‌వ్ కంపెనీల‌కు జారీ చేసే ప్ర‌తి ఎల్ ఓయూలో బ్యాంకు సిబ్బంది వాటాల‌ను పంచుకున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని కింద బ్యాంకు ముట్టే క‌మిష‌న్ సైతం పంచుకున్న‌ట్లుగా సీబీఐ విచార‌ణ‌లో తేలింది. ఇక‌.. నీర‌వ్ నుంచి బ్యాంకు సిబ్బందికి ప్ర‌త్య‌క్షంగా కానీ ప‌రోక్షంగా కానీ ఎలాంటి ప్ర‌లోభాలు అందాయ‌న్న దానిపై దృష్టి సారించారు.