Begin typing your search above and press return to search.

అమరావతి రైతులకు సంక్రాంతి సినిమా దర్శకుడి మద్దతు

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:30 PM GMT
అమరావతి రైతులకు సంక్రాంతి సినిమా దర్శకుడి మద్దతు
X
రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌ను నిర‌సిస్తూ ఇప్ప‌టికీ అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆందోళ‌న‌లు ఉధృత రూపం దాల్చుతుండ‌టంతో... ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, పోలీసు యాక్టు-30 అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేప‌థ్యంలో అన్నివ‌ర్గాల‌కు చెందిన వారు త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ రాజధానిని మార్చడం స‌రైన నిర్ణ‌యం కాద‌న్నారు. రాజధాని పై మాట్లాడని హీరో, దర్శకుల సినిమాలు చూడకండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. తాజాగా, ప్ర‌ముఖ న‌టుడు కళ్యాణ్ రామ్‌తో `ఎంత మంచి వాడవురా` సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న సైతం స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

క‌ళ్యాణ్ రామ్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్‌గా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంత‌మంచివాడ‌వురా ఈనెల 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఓ వైపు ఈ సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న స‌తీశ్ తాజాగా అమ‌రావ‌తిపై స్పందించారు. రైతుల నుంచి మొద‌లుకొని రాజ‌కీయాల వ‌ర‌కూ ఆయ‌న ఘాటుగా స్పందించారు. అమరావతి ప్రాంత రైతుల భార్యలు గతంలో ఎప్పుడూ బయటకు రాలేదని పేర్కొన్న స‌తీశ్ ఇప్పుడు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆ మ‌హిళ‌లు బయటకు వస్తున్నారని తెలిపారు. ``రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం వారి తప్పా..?  రైతులు ప్రకృతి వారసులు. మనం ప్రకృతికి ఏదైనా ఇబ్బంది తలపెట్టాలని చూస్తే, ఆ ప్ర‌కృతి ఎలా విరుచుకు పడుతుందో.. రైతులు కూడా తమ జోలికి వస్తే అలానే విజృంభిస్తారు` అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌రోక్షంగా సినీన‌టుడు పృథ్వీపై కూడా విమ‌ర్శ‌లు చేశారు. అమ‌రావ‌తిలో ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ కొంతమంది మాట్లాడ‌టం స‌రికాద‌ని స‌తీశ్ పేర్కొన్నారు. `పెయిడ్ ఉద్యమం అయితే కొద్ది రోజుల్లోనే అది ముగిసేది. కానీ ఈ ఉద్యమ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది` అని విశ్లేషించారు.