Begin typing your search above and press return to search.

పెళ్లి వేడుకకు మొత్తం విమానాన్ని బుక్ చేసేశారు

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:22 AM GMT
పెళ్లి వేడుకకు మొత్తం విమానాన్ని బుక్ చేసేశారు
X
కాలం మారింది. అందుకు తగ్గట్లు రోజులు మారాయి. ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. తాము అనుభవించే హ్యాపీనెస్ ను తమకు తోడుగా నిలిచే వారితో పంచుకోవాలి. ఆ అనుభూతి అందరికి సొంతం కావాలి. ఇలాంటి ఆలోచనలు ఈ మధ్యన పెరుగుతున్నాయి.

కొవిడ్ పుణ్యమా అని రెండేళ్ల పాటు దాదాపుగా దెబ్బ తిన్న భారీ వేడుకలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి.కొవిడ్ వేళలో.. పెళ్లి జరిగితే చాలురా భగవంతుడా అన్నట్లుగా మారిన పరిస్థితి నుంచి పెళ్లి వేడుకకు.. ఆ మాత్రం లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అన్నట్లుగా పరిస్థితులు మారాయి.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. గతంతో పోలిస్తే ఈసారి భారీగా పెళ్లిళ్లు ఈ సీజన్ లో జరగనున్నాయి. తాజాగా తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని ఒక ఫ్యామిలీ భావించింది. మిగిలిన వారికి భిన్నంగా ఏం చేయొచ్చని ఆలోచించిన ఆ కుటుంబం.. పెళ్లి వేడుకకు బంధువుల్ని తమవెంట తీసుకెళ్లేందుకు ఏకంగా ఒక ఫుల్ ఫ్లైట్ ను బుక్ చేసేసిన వైనం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు.

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరిగే వివాహానికి హాజరయ్యే కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులందరూ ఒకేసారి.. ఒకే ఫ్లైట్ లో వెళ్లేందుకు వీలుగా ఒక ఫుల్ విమానాన్ని బుక్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో విమానంలోని అందరి బంధువుల్ని చూపిస్తూ చివర్లో పెళ్లి చేసుకునే జంటను చూపిస్తారు.

కేరింతలతో హుషారుగా ఉన్న వైనం వీడియోలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అయితే.. ఈ వీడియోను నెటిజన్ల నుంచి స్పందన మిశ్రమంగా సాగింది. పెళ్లి కోసం బంధువులందరిని విమానంలో తీసుకెళ్లేంత డబ్బు ఉండాలిగా? అని ఒకరంటే.. పెళ్లి కోసం ఏకంగా ప్లైట్ బుక్ చేశారు.. సో గ్రేట్, మీరు డబ్బున్నోళ్లు అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారుగా అని మరొకరు రియాక్టు అయ్యారు. ఈ వీడియోను కోటి మందికి పైగా చూడటం విశేషం.