Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు!

By:  Tupaki Desk   |   4 Oct 2018 1:09 PM GMT
టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు!
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి రాజుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు టీఆర్ ఎస్....మ‌హాకూట‌మితో టీఆర్ ఎస్ ను దెబ్బ‌కొట్టాల‌ని కాంగ్రెస్ వ్యూహ ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఓ ప‌క్క ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ...ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టి వారికి తాయిలాలు స‌మ‌ర్పించే ప‌నిలో నేత‌లంతా బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా, టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోని ఎల్లారెడ్డిలో ఓట‌ర్ల‌కు ర‌వీంద‌ర్ డ‌బ్బులు పంచుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు ఈసీ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ ఎస్ కు ఓటు వేస్తే 5ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తానంటూ ఎల్లారెడ్డిలోని ఓ మ‌హిళ‌కు ర‌వీంద‌ర్ ఆఫ‌ర్ ఇస్తోన్న‌ దృశ్యాలు కంటికి చిక్కాయి. 50 మంది స్వ‌యం స‌హాయ‌క బృంద స‌భ్యులైన మ‌హిళ‌ల‌ను స‌మావేశ ప‌ర‌చాల‌ని ఆ మ‌హిళ‌ను ర‌వీంద‌ర్ వీడియోలో కోరుతున్నారు. వారంతా టీఆర్ ఎస్ కు ఓటువేసేలా ప్ర‌మాణం చేయించాల‌ని కోరారు. అయితే, 5ల‌క్ష‌లు స‌రిపోవ‌ని ఆ మ‌హిళ‌...ర‌వీంద‌ర్ తో చెప్ప‌డం....మీటింగ్ అయిన త‌ర్వాత అవ‌స‌ర‌మైతే మ‌రికొంత డ‌బ్బు ఇస్తామ‌ని ర‌వీంద‌ర్ చెప్ప‌డం వీడియోలో రికార్డ‌యింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో, ర‌వీంద‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ను ఈసీ ఆదేశించింది. క‌లెక్ట‌ర్ ఆదేశాల ప్ర‌కారం ర‌వీంద‌ర్ పై ఎల్లారెడ్డి త‌హ‌శీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబ‌రు 6న జ‌రిగిన ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో వ‌ల్ల ర‌వీంద‌ర్ చిక్కుల్లో ప‌డ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ర‌వీంద‌ర్ పై ఈసీ ఏ చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.