Begin typing your search above and press return to search.

కెమికల్ కంపెనీల ఎఫెక్ట్ - పింక్ కలర్‌ లోకి మారిన రోడ్లు

By:  Tupaki Desk   |   15 Feb 2020 3:30 AM GMT
కెమికల్ కంపెనీల ఎఫెక్ట్ - పింక్ కలర్‌ లోకి మారిన రోడ్లు
X
రోజురోజుకు పెరుగుతున్న జనాభా - పరిశ్రమలు - మనిషి తన జీవనం కోసం వృక్ష - పశు - జంతు సంపదను కొల్లగొడుతూ పర్యవరాణానికి హాని కలిగిస్తున్నారు. వాతావరణ కాలుష్యం వల్ల మనుషులు రోగాల బారిన పడటం, పశుపక్షాదులు చనిపోవడం వినేది. కానీ కాలుష్యం కారణంగా రోడ్లు కూడా రంగు మారుతున్నాయని తెలుసా? ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. థానే పట్టణంలోని డోంబివ్లీ ఎంఐడీసీ ఫేజ్ 1లో పొల్యూషన్ కారణంగా రోడ్లన్నీ గులాబీ రంగులోకి మారిపోతున్నాయి. ఇక్కడ ఆగ్రో కెమికల్ - పెస్టిసైడ్ - ఇతర రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి.

గతంలో ఓసారి వర్షం కూడా ఆకుపచ్చ రంగులో కురిసిందని చెబుతారు. ఇక్కడి రసాయన పరిశ్రమల కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని వర్షం - రోడ్ల రంగుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల డోంబివ్లీ రోడ్డులో నడిచిన వారంతా రోడ్డు పింక్ కలర్‌ లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. రోడ్లపై పరిశ్రమల నుండి వచ్చే రసాయన పౌడర్ పడటంతో రహదారుల రంగు మారిపోయింది. దీంతో స్థానికులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు విన్నవించుకున్నారు.

ఈ విషయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వరకు వెళ్లింది. దీనిపై ఆయన ఇటీవల నివేదిక కోరారు. ఇక్కడ అధికారులు పరిశీలన చేసి - రోడ్లపై మట్టి శాంపిల్స్‌ ను సేకరించారు. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. రోడ్లు రంగులు మారడానికి స్థానికంగా ఉన్న కెమికల్ పరిశ్రమలు - వాటిలో నుండి వచ్చే పౌడర్ అని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లు రంగు మారడమే కాకుండా దుర్వాసన - విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి ఆగ్రో కెమికల్ - పెస్టిసైడ్ ఇతర కెమికల్ ఫ్యాక్టరీల నుండి కొన్నేళ్లుగా వస్తున్న వాయువులు తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల రోడ్డు శాంపిల్స్ సేకరించారు. ఈ ప్రాంతంలో 2013లో వర్షం ఆకుపచ్చని రంగులో కురిసింది. అప్పుడే కాలుష్యంపై ఆగ్రహం వెల్లువెత్తింది.