Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి అభయమిచ్చినా..భయం వీడట్లే

By:  Tupaki Desk   |   1 March 2016 11:47 AM GMT
కేంద్ర మంత్రి అభయమిచ్చినా..భయం వీడట్లే
X
నిజం. స్వ‌యంగా కేంద్ర‌మంత్రి అభ‌యం ఇచ్చిన‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఇక్క‌ట్ల పాలు చేస్తున్న ఎపిసోడ్‌ లో ఇంకా సస్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఇంత‌కీ అంత‌గా ఆయ‌న్ను ఇబ్బంది పెడుతున్న విష‌యం ఏమిటంటే...న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి నిర్మాణంపై ఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో దాఖలైన పిటీషన్‌.

చంద్ర‌బాబు నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం 36,000 ఎక‌రాల్లో నిర్మించ తలపెట్టిన రాజధాని ప్రాంతానికి వరద ముప్పు ఉందని, అలాగే సారవంతమైన భూములను వినియోగించి పర్యావరణానికి హాని తలపెడుతున్నారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ లో పండ‌ల‌నేని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీ సర్కార్‌ కు - సీఆర్‌ డీఏ - అటవీశాఖకు ఎన్‌ జీటీ నోటీసులు జారీ చేసింది. అనంత‌రం ప‌లు ద‌ఫాల విచార‌ణ జ‌రిగింది. అయితే బాబుకు ఈ విష‌యంలో ఇటీవ‌లే తీపిక‌బురు ద‌క్కింది. అమరావతి నిర్మాణానికి త్వరలోనే పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు ఇస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ చెప్పారు. నెల్లూరు జిల్లా నేలటూరులో జెన్‌ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ త్వ‌ర‌లో ఈ అనుమ‌తులు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలాఉండ‌గా గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ లో తాజాగా అమ‌రావ‌తి కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ తరుపు న్యాయవాది వాద‌న‌లు వినిపించేందుకు మ‌రింత‌ గడువు కావాలని కోరడంతో ఎన్‌ బీటీ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ చాలాసార్లు వాయిదావేస్తూ వచ్చారని, మరోసారి వాయిదావేయబోమని బెంచ్ స్ప‌ష్టం చేస్తూ చివ‌రి అవ‌కాశంగా ఈ నెల ఏడోతేదీన వాయిదాకు అవ‌కాశం ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఇచ్చే అనుమ‌తుల విష‌యంలో ఇపుడు ఏపీ స‌ర్కారులో ఉత్కంఠ నెల‌కొంది.