Begin typing your search above and press return to search.

వైశ్యుల్లో ఉన్న ఆ లోపం ఏమిటి?

By:  Tupaki Desk   |   29 Jan 2016 5:30 PM GMT
వైశ్యుల్లో ఉన్న ఆ లోపం ఏమిటి?
X
వ్యాపార వర్గాల్లో తమ పట్టును ప్రదర్శించే వైశ్య వర్గానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. చాలా తక్కువమందికి మాత్రమే తెలిసిన ఈ అంశంపై ఇటీవల కాలంలో జరిపిన పరిశోధనలలో వారిలో ఒక ఎంజైమ్ లోపం ఉందని... దీని కారణంగా శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న సమయంలో మరణాల బారిన పడిన విషయం తేలింది. ఇంతకీ ఏమిటా ఏంజైమ్.. ఏమా సమస్య? వైశ్యులు తెలుసుకోవాల్సిందేమిటి? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలోకి వెళితే..

వైశ్యుల్లో ఉన్న ఆ లోపం ఏమిటి?

తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషిలో సర్వ సాధారణంగా ఉండే ఒక ఎంజైమ్ వైశ్యుల్లో మిస్సయ్యిందట. ఇది ఆ వర్గంలో మాత్రమే మిస్ కావడం వైద్య వింత. దీన్ని 'బ్యూటిరైల్కోలీనీస్టరేస్' అని పిలుస్తారు. దీనిని బీసీహెచ్ ఈ.. సూడో కోలీనీస్టరేస్.. ఫ్లాస్మా కోలీనీస్టరేస్ గా కూడా వ్యవహరిస్తుంటారు.

దీని వల్ల జరిగే పరిణామం ఏమిటి?

కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఈ ఎంజైమ్.. రక్తంలోని ప్లాస్మాలో కనిపిస్తుంది. కొన్ని రకాల మందులు పని చేయటంలో ఈ ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తుంది.

ఈ ఎంజైమ్ ఉపయోగం ఏంటి?

శస్త్రచికిత్సల సమయంలో మత్తు మందు ఇస్తుంటారు. ఆ సమయంలో నొప్పి తెలీకుండా ఉండటంతో పాటు.. కొన్ని విష పదార్థాలు మెదడుకు చేరనీయకుండా ఈ ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తుంది.

వైశ్యులకే ఎందుకీ సమస్య?

అయితే.. ఈ ఎంజైమ్ వారిలో ఉండదన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఈ విషయంపై అవగాహన ఉన్నా.. ఆ సంఖ్య చాలా తక్కువగా మాత్రమే ఉండేది. తాజాగా విజయవాడ.. విశాఖపట్నంలో పలువురు వైశ్యుల రక్తాన్ని సేకరించిన పరీక్షలు జరపగా.. ఈ విషయం బయటకు వచ్చింది.

ఎందుకిలా జరిగింది?

కొన్ని వందల ఏళ్లుగా పెళ్లిళ్లు ఒకే కులంలో అంతర్గతంగా జరగటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒకే కులం వారి మధ్య పెళ్లిళ్లు ఎంజైమ్ లోపానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఎంజైమ్ లోపం ఉన్న ఇద్దరి మధ్య పెళ్లిళ్లు నివారించగలిగితే వారికి పుట్టబోయే పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

దీని వల్ల జరిగే నష్టం ఏమిటి?

ఈ ఎంజైమ్ లోపం వల్ల ఏదైనా ఆహారపదార్థాలు తిన్నప్పుడు.. దాని తాలూకూ ఏదైనా విష పదార్థం మెదడుకు చేరే ప్రమాదం ఉంటుందట. శస్త్ర చికిత్సల సమయంలో మత్తు మందు ఇచ్చినప్పుడు ఈ ఎంజైమ్ లోపం కారణంగా వారు మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు.

మరేం చేయాలి?

వైద్యుల్ని సంప్రదించే సమయంలోనూ.. శస్త్ర చికిత్సల సందర్భంగా వైశ్యులు తమ కులాన్ని వైద్యులకు తప్పనిసరిగా వెల్లడించాలి. దీంతో.. ఈ ఎంజైమ్ లోపం కారణంగా జరిగే ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.