Begin typing your search above and press return to search.

గణేష్ ఉత్సవాలకు మహమ్మారి ఎఫెక్ట్ !

By:  Tupaki Desk   |   2 July 2020 5:00 AM IST
గణేష్ ఉత్సవాలకు మహమ్మారి ఎఫెక్ట్ !
X
దేశంలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేకపోవడంతో... దాని ప్రభావం సమీప భవిష్యత్తులో జరగాల్సిన ఇతర కార్యక్రమాలపై కూడా పడింది. భారత్‌ లో అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలపై వైరస్ ప్రభావం భారీగానే ఉంటుందనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ముంబైలోని అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్ బాగ్ గణేశుడి ఉత్సవాలకు ఈ ఏడాది బ్రేక్ పడింది.

ముఖ్యంగా మహారాష్ట్ర గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ముంబై లో గణనాథుడి నవరాత్రులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అందరూ కలిసి ఎంతో సరదాగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ సారి మాత్రం వాటికి అందరూ దూరం కావాల్సిందే. మహమ్మారి ఎఫెక్ట్‌ తో ఈ సారి గణేష్ ఉత్సవాల్ని నిర్వహించడం లేదు. ఈసారి లాల్ బాగ్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించవద్దని లాల్ బాగ్ గణేశ్ ఉత్సవ మండలి నిర్ణయించింది. అందుకు బదులుగా ఈ ప్రాంతంలోనే రక్తదాన, ప్లాస్మాదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. నాలుగు అడుగుల లోపు ఎత్తు గల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని, ఈ సారి వినాయ నిమజ్జనం ఉండదని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన నేపథ్యంలో లాల్‌బాగ్చా గణేశ్ ఉత్సవ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

గతేడాది, చంద్రయాన్‌-2 ఆకారంలో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈసారి మాత్రం గణేష్ ఉత్సవాలు నిర్వహించేది లేదని కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం మీద మహమ్మారిఅన్ని పండగల మీద తన ఎఫెక్ట్ చూపిస్తుంది. ముంబై లో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువ గా ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైరస్ విజృంభణ కారణంగా హైదరాబాద్ ‌లోని అత్యంత ఎత్తయిన ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఎత్తును కూడా భారీగా తగ్గించాలని నిర్వాహకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.