Begin typing your search above and press return to search.

సీఎం రేసులో కేజ్రీ, బేడీలకు ఈక్వల్‌ క్రేజ్‌!!

By:  Tupaki Desk   |   20 Jan 2015 8:49 AM GMT
సీఎం రేసులో కేజ్రీ, బేడీలకు ఈక్వల్‌ క్రేజ్‌!!
X
ఢిల్లీ లో ఎన్నికలు అనుకున్నప్పటినుండి... ప్రధానపోటీ బీజేపీ, ఆప్‌ ల మధ్యే ఉండబోతోందని మీడియామొత్తంలో రావడంతోపాటు, అటు బీజేపీ నేతలే కాని, ఇటు ఆప్‌ అధినేత కానీ... వారి వారి ఎన్నికల ప్రసంగాల్లో కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతోన్నాయి! అవును ఇది నిజమే అని అందరికీ తెలిసిన విషయమే! అయితే తాజాగా ఢిల్లీలో కొన్ని మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో... కాంగ్రెస్‌ కీలకం కాబోతోందని ఫలితాలు వచ్చాయి! నిన్నటి వరకూ ఆప్‌ వైపే ఉన్న ఫలితాలు అన్నీ... కిరణ్‌ బేడీ చేరికతో బీజేపీ కి కూడా కాస్త ప్లస్‌ గా మారాయి! అయితే... ఎన్ని సర్వేలు జరిగినా వాటి ఫలితాలు మాత్రం వీరిద్దరికీ మద్య అతి తక్కువ వ్యత్యాసాన్ని చూపిస్తోన్నాయి! అటు సీఎం అభ్యర్థిగానే కాకుండా, ఎన్నికల ఫలితాలను బట్టి చూసినా కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ కు, కిరణ్‌ బేడీకి మద్య ఓట్ల శాతమే కానీ, సీట్ల శాతమే కానీ... అతి స్వల్పంగా ఉండొచ్చనేది ఈ ప్రీపోల్స్‌ వివరణ!

దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌ బేడీ మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ ఉందని తాజాగా ఒక సర్వే వెల్లడించింది! ఈ సర్వేలో ఢిల్లీ ముఖ్యమంత్రి గా కేజ్రీవాల్‌కు 47 శాతం, బీజేపీలో చేరిన కిరణ్‌ బేడీకి 44 శాతం ప్రజలు మద్దతు పలికారట! సుమారు ఇదే స్వల్ప వ్యత్యాసం అసలు ఫలితాల్లో కూడా ఉండొచ్చని పలువురి వాదన! మరో విశేషం ఏమిటంటే... ఢిల్లీలో దాదాపు యాభై శాతం పైగా మహిళలు కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు! మహిళల రక్షణ విషయంలో దేశం మొత్తం ఢిల్లీపై చర్చ నడుస్తోన్న నేపథ్యంలో మహిళల ఓట్లు కచ్చితంగా కీలకం కాబోతోన్నాయి! అయితే ఇవి ఎక్కువ శాతం అరవింద్‌ కేజ్రీవాల్‌ కే పడే అవకాశాలున్నాయి!

మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే... కిరణ్‌ బేడీ ఆం ఆద్మీ పార్టీ లో చేరి ఉంటే బాగుండేదని 44 శాతం మంది అభిప్రాయపడగా, బీజేపీలో చేరడమే మంచిదయిందని 30 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు! ఇది కచ్చితంగా కిరణ్‌ బేడీకి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది! ఇక్కడ మరో విషయం ఏమిటంటే... కిరణ్‌ బేడీ ని వ్యక్తిగతంగా సీఎం అభ్యర్థిగా కోరుకునేవారు, అటు బీజేపీకి కూడా మద్దతుదారులు అయితేనే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి! ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో అటు ఆప్‌ కి కానీ, ఇటు బీజేపీకి కానీ... పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు మాత్రం లేవని కొన్ని అంచనాలు నడుస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు చూస్తుంటే... దేశ రాజధానిలో మరోసారి హంగ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి! ఆసమయంలో కచ్చితంగా 5 - 10 సీట్లు తెచ్చుకుంటే మాత్రం కాంగ్రెస్‌ కీలకంగా మారే అవకాశాలున్నాయి అని విశ్లేషకుల అభిప్రాయం! ఆ మాత్రం సీట్లు వస్తే కాంగ్రెస్‌ కీలకంగా మారగలదు కానీ... నిజానికి వారి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత వారి అస్తిత్వమే సందేహాస్పదం అయ్యే అవకాశమూ ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.